నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసు (National Herald corruption case)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎదుట విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. మధ్యలో గ్యాప్ దొరకగానే హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు. బ్రేక్ గడువు ముగిసేలోపే తిరిగి ఈడీ ఆఫీసులకు వచ్చేశారు.
అన్ లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) పేరుతో తప్పు దారిలో వడ్డీ లేని రుణాలు పొందారనే ఆరోపణలకు సంబంధించిన ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని ఈడీ, కాంగ్రెస్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలివే..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాజరైన రాహుల్ గాంధీ ఏకబిగిన 3 గంటల సేపు విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం ఆయన ఈడీ కార్యాలయాన్ని విడిచిపెట్టారు. అక్కడి నుంచి నేరుగా గంగారాం ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ వెంట సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
కోవిడ్ అనంతర సమస్యలతో గంగారామ్ ఆసుపత్రిలో సోనియాగాంధీ చికిత్స పొందుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులోనే ఈనెల 8న సోనియాగాంధీ ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రిలో చేరడంతో తనకు మరికొంత సమయం కావాలని ఈడీకి సోనియాగాంధీ తెలియజేశారు. సోనియాను పరామర్శించిన తర్వాత రాహుల్ తిరిగి ఈడీ కార్యాయాలయానికి చేరుకున్నారు.
తొలి సెషన్ లో సుమారు 3 గంటల సేపు విచారణ సాగింది. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఈడీ విచారణలో రాహుల్పై పలు ప్రశ్నల వర్షం కురిపించింది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మీ హోదా ఏమిటి? యంగ్ ఇండియన్ సంస్థతో మీ సంబంధం ఏమిటి? మీ పేరుతో ఆ సంస్థలో షేర్లు ఎందుకు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకు ఇచ్చారని ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇవాళ రాహుల్ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఈడీ కార్యాలయంలోకి రాహుల్ గాంధీ లాయర్లను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగగా, పెద్ద సంఖ్యలో అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేసి అరెస్టయ్యారు. ఢిల్లీలో అరెస్టయిన కీలక నేతలను తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించగా, ప్రియాంక గాంధీ అక్కడికెళ్లి నేతలను పరామర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Enforcement Directorate, Rahul Gandhi, Sonia Gandhi