Rahul Gandh London visit: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లేబర్ పార్టీ మాజీ నేత జెరెమీ కార్బిన్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడం పలు వివాదాలకు దారి తీసింది. అయితే తాజాగా మరో వివాదంలో రాహుల్ గాంధీ చిక్కున్నాడు. భారత విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్(Political Clearence)రాకుండానే రాహుల్ లండన్(London)వెళ్లినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో పార్లమెంట్ సభ్యులందరూ విదేశాంగ శాఖ క్లియరెన్స్ తీసుకోవాల్సి వుంటుంది. ఏ ఎంపీ అయినా విదేశీ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో కనీసం మూడు వారాల ముందే వుంచాలి. ఈ నిబంధనను రాహుల్ గాంధీ పాటించలేదని సమాచారం. రాహుల్ గాంధీ లండన్‌లో పాల్గొనే కార్యక్రమానికి ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా కూడా వెళ్లారు. అయితే మనోజ్ ఝా...రాజకీయ క్లియరెన్స్‌తో సహా అన్ని సంబంధిత అనుమతులను కలిగి ఉన్నారని సమాచారం.
విదేశాల నుంచి నేరుగా సదురు ఎంపీకే ఆహ్వానం ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి పొలిటికల్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని బుధవారం ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో గతంలోనే నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్ ఈ వాదనను తోసిపుచ్చింది. ఎంపీలు అధికారిక ప్రతినిధి బృందంలో భాగమైతే తప్ప మిగిత వారికి ప్రభుత్వం నుండి అలాంటి క్లియరెన్స్ అవసరం లేదని వాదించింది. అధికారిక విదేశీ పర్యటనలు కానప్పుడు ఎంపీలు.. ప్రధాని నుంచో, ప్రభుత్వం నుంచో రాజకీయ పరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.
ALSO READ Chinese visas case : చైనీయులకు వీసాల్లో అక్రమాలు..చిదంబరం మెడకు మరో ఉచ్చు
మరోవైపు, యూకే పర్యటలో ఉన్నరాహుల్ గాంధీ..బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు, లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌ను సోమవారం లండన్ లో కలిశారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్ ఈ ఫొటోను షేర్ చేసింది. అయితే జెరెమీ కార్బిన్‌ను రాహుల్ గాంధీ కలవడం దేశంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణం జెరెమీ కార్బిన్ గతంలో భారత్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. 2015 నుంచి 2020 మధ్య బ్రిటన్ పార్లమెంట్లో విపక్ష నేతగా పనిచేసిన జెరెమీ.. పలు విషయాల్లో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరుచేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. అటువంటి వ్యక్తిని రాహుల్ కలవడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జెరెమీ కార్బిన్ ను రాహుల్ ఎందుకు కలిశారని బీజేపీ ప్రశ్నిస్తోంది. జెరెమీ గతంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, వాటికి రాహుల్ మద్దతిస్తున్నారా అని బీజేపీ ప్రశ్నించింది. ఇక,బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గతంలో జెరెమీని మోదీ కలిసిన ఫొటోను షేర్ చేస్తూ.. అదే ప్రశ్నను బీజేపీకి సంధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: London, Rahul Gandhi