ఒకప్పుడు బతుకుదెరువు కోసం చెత్త ఏరే పని చేసిన ఆ వ్యక్తి నేడు చండీఘడ్ నగరానికి మేయర్. ఆయనే వాల్మీకి కమ్యూనిటీకి చెందిన రాజేశ్ కలియా(46). శనివారం నాడు జరిగిన ఎన్నికలో మొత్తం 27 ఓట్లకు గాను 16 ఓట్లు దక్కించుకుని చండీఘడ్ మేయర్గా గెలుపొందాడు. గతాన్ని తలుచుకుని తానేమి సిగ్గుపడటం లేదని.. మేయర్ స్థాయికి వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
రాజేశ్ తండ్రి కుందన్ లాల్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన సోదరుల్లో ఒకరు ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. అణగారిన కుటుంబంలో పుట్టడం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. ఒకప్పుడు రాజేశ్ కూడా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేయక తప్పలేదు. ఆ పని ద్వారా వచ్చే డబ్బుతో కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాడు.
కింది స్థాయి కులంలో పుట్టినందువల్ల తాను ఎలాంటి వివక్షకు గురైంది రాజేశ్ గుర్తుచేసుకుంటున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాకు చెందిన రాజేశ్ కుటుంబం 1977లో చండీఘఢ్కి మారింది. ఆ సమయంలో తక్కువ కులం అన్న కారణంగా ఆ కుటుంబం వివక్షను ఎదుర్కొంది. కానీ కష్టపడే తత్త్వంతో రాజేశ్ ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడంపై ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.
తమ తండ్రి చెత్త ఏరడం ఒక్కటే కాదు, ఆటో రిక్షా నడపడం సహా చాలా రకాల పనులు చేశాడని రాజేశ్ ముగ్గురు కుమార్తెలు చెబుతున్నారు. ఈరోజు తమ తండ్రి మేయర్ పదవికి ఎంపిక కావడం సంతోషంగా ఉందంటున్నారు. చెత్త ఏరుకునే నేపథ్యం నుంచి వచ్చిన రాజేశ్.. చంఢీఘఢ్ను ఇప్పుడు క్లీన్ సిటీగా మార్చడమే తన లక్ష్యం అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana