సరిహద్దుల్లో డ్రాగన్ రెచ్చిపోతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో దుస్సాహసానికి ఒడిగడుతూ చెలరేగిపోతోంది. నిత్యం గొడవలు పెట్టుకుంటూ చైనా దళాలు పేట్రేగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత వైమానిక దళంలోకి రఫేల్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. ఈ కార్యక్రమం సందర్భంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు రక్షణమంత్రి రాజ్‌నాథ్. భారత్‌పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి రఫేల్ చేరిక గట్టి సందేశమని స్పష్టం చేశారు. LAC వద్ద భారత వైమానికదళం అప్రమత్తంగా వ్యవహరించిన తీరు ఎంతో అభినందనీయమన్నారు రాజ్‌నాథ్ సింగ్.
''రఫేల్ యుద్ద విమానాల రాకతో భారత్, ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భవిష్యత్తులోనూ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్‌కు రఫేల్ విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. రక్షణ రంగంలో 74శాతం ఎఫ్‌డీఐలు అనుమతించబడ్డాయి. దేశీయ రక్షణరంగ పరిశ్రమను ప్రోత్సహించేలా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ను ఆహ్వానిస్తున్నాం. జాతీయ భద్రతే మా మొదటి ప్రాధాన్యత. మా పరిధుల్లోనేకాక ఇండో-పసిఫిక్, హిందూమహా సముద్ర ప్రాంతంలోనూ శాంతికి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాద ముప్పును ఏ మాత్రం విస్మరించే ప్రసక్తే లేదు.'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఫ్రాన్స్ సాయుధ బలగాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లె.. భారత్, ఫ్రాన్స్‌కు ఇదో గొప్ప విజయమని అన్నారు. రఫేల్ యుద్ధ విమానాలు భారత్, ఫ్రాన్స్ సంబంధాల్ని సూచిస్తున్నాయని.. ఇండియాకు ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. రఫేల్ యుద్ధ విమానాలు ఎప్పుడైనా.. ఎక్కడైనా.. పరిస్థితులను అదుపులోకి తేగలవని IAF చీఫ్ బదౌరియా పేర్కొన్నారు.
భారత వైమానిక దళంలోకి రఫేల్ యుద్ధ విమానాలు లాంఛనంగా ప్రవేశించాయి. 17 స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్‌లో ఈ ఫైటర్ జెట్స్ చేరాయి. హరియాణాలోని అంబాల ఎయిర్‌బేస్‌లో ఈ కార్యక్రమం జరుగింది. ముందుగా రఫేల్ విమానాన్ని ఆవిష్కరించి.. సర్వ ధర్మ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆకాశంలో రఫేల్, తేజస్ విమానాలు విన్యాసాలు చేశాయి. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదూరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ ఆర్అండ్డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఫ్రెంచ్ ప్రతినిధి బృందానికి చెందిన ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్, ఎయిర్ జనరల్ ఎరిక్ ఆటోలెట్, ఫ్రెంచ్ వైమానిక దళం వైస్ చీఫ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.