హోమ్ /వార్తలు /జాతీయం /

రాఫెల్ ఆరోపణలు అవాస్తవం... నేను ఇప్పటికీ చౌకీదార్‌నే : ప్రధాని నరేంద్ర మోదీ

రాఫెల్ ఆరోపణలు అవాస్తవం... నేను ఇప్పటికీ చౌకీదార్‌నే : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూస్18 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

న్యూస్18 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

ModiSpeaksToNews18 : రాఫెల్ డీల్‌పై రాహుల్ ఆరోపణలను ఖండించిన మోదీ... దేశ ప్రజలకు అన్నీ తెలుసన్నారు. కాంగ్రెస్ ఆటలు సాగవన్నారు.

  రాఫెల్ డీల్‌లో ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మోదీ చౌకీదార్ కాదనీ, చోర్ అనీ సెటైర్లు కూడా వేస్తున్నాయి. మోదీ మాత్రం నేను కూడా చౌకీదార్‌ని అనే నినాదం అందుకున్నారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చింది. దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ విషయంపై న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాఫెల్ అంశం వరకూ చూస్తే... నిజానికి ప్రతిపక్షాలు దీనిపై పెద్దగా స్పందించలేదనీ... ఒక్కరు మాత్రం అదే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ పలికారని పరోక్షంగా రాహుల్‌ను ఆరోపించారు. ప్రతి చోటా ఈ అబద్ధాల్ని ప్రజలు తిప్పికొట్టారనీ... చివరకు సుప్రీంకోర్టు, కాగ్ కూడా ఈ ఆరోపణలను ఖండించాయన్నారు. కొంతమంది తటస్థ జర్నలిస్టులు... బోఫోర్స్ కుంభకోణంలో జరిగిన అక్రమాల్ని ప్రశ్నించారనీ.... కానీ ఆ ఒక్కరూ మాత్రం ఎలాంటి ఆధారాలూ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆ ఆరోపణలు ఎన్నాళ్లు నిలుస్తాయన్న మోదీ... ఆ ఒక్కరికీ చెందిన సలహాదారులు కూడా రాఫెల్ అంశం రాజకీయ అంశం కాదని చెప్పారని తెలిపారు. తన సొంతవాళ్లే ఇక ఆ విషయాన్ని వదిలేయమని అంటే... ఆ ఒక్కరూ మాత్రం... తన తండ్రి హయాంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణం మచ్చను చెరిపేయాలని రాఫెల్ అంశాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు మోదీ.


  రక్షణ కుంభకోణాలతో కాంగ్రెస్ నాశనమైందన్నారు మోదీ. వాళ్లు మిగతా ప్రభుత్వాలపైనా అవే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాజ్ పేయ్ ప్రభుత్వ హయాంలో వారు అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను శవపేటికల స్కాంలో ఇరికించాలని చూశారన్న మోదీ... ఆ ఆరోపణలు నిజం కాదని తేలిందన్నారు. ఇప్పుడు తనను కూడా ఇరికించాలని చూస్తున్నారన్న మోదీ... ఆధారాలు ప్రజలకు చూపించమంటే, చూపించలేకపోతున్నారని అన్నారు. వాళ్లు అబద్ధాలు మాట్లాడటం వల్లే... ఈ అంశం పెద్దగా ప్రభావితం చెయ్యలేకపోతోందని మోదీ అన్నారు.


  కొన్నేళ్లుగా తాను ప్రజలతో ఉన్నానన్న మోదీ... ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా తనపై అవినీతి ఆరోపణలు చెయ్యలేకపోయారని వివరించారు. ప్రజలు అబద్ధాల్ని ఆమోదించరన్న ప్రధాని... ప్రజలు తెలివైన వారనీ... ఆరోపణలు చేసేవాళ్ల మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు.


  చౌకీదార్ విషయానికొస్తే... 2013-2014లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను కాపలాదారుగా భావించాలని ప్రజలను కోరాననీ, తాను దేశ సంపద తరలిపోకుండా చూస్తానని మాట ఇచ్చానని మోదీ తెలిపారు. ఈ రోజుకూ తాను చౌకీదార్ గానే ఉన్నానన్న ఆయన... ఎవరూ సంపద దోచుకోకుండా చేస్తున్నాన్నారు. ఎవరైనా సంపదను దోచుకుంటే... తాను చట్టపరంగా కఠిన చర్య తీసుకుంటానన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం విజయం సాధించిందన్న మోదీ... అది నిజాయితీ పెంపొందిస్తోందన్నారు.

  First published:

  Tags: Lok Sabha Election 2019, Narendra, Narendra modi, Rahul Gandhi

  ఉత్తమ కథలు