Punjab CM Amarander Singh | సట్లెజ్ - యమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండంగా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. అప్పుడు పంజాబ్ - హర్యానా నీటి పంపకం వివాదం జాతీయ భద్రతతా సమస్యగా మారుతుందని కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ సమక్షంలోనే పంజాబ్ సీఎం ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన అంశం. ‘ఈ అంశాన్ని మీరు జాతీయ భద్రతా కోణంలో కూడా చూడాలి. మీరు సట్లెజ్ - యమునా లింక్ కెనాల్ మీద ముందుకు వెళితే పంజాబ్ మండుతుంది. అప్పుడు జాతీయ భద్రత సమస్యకు దారితీస్తుంది. అప్పుడు హర్యానా, రాజస్థాన్ కూడా బాధపడాల్సి వస్తుంది.’ అని అమరీందర్ సింగ్ అన్నారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య జలవివాదం ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన 1966 సంవత్సరం నుంచే ఉంది. హర్యానా రాష్ట్రం తమకు ఎక్కువ నీటి వాటా రావాలని డిమాండ్ చేసింది. అయితే, పంజాబ్ అందుకు నిరాకరించింది. తమకు అదనపు నీరు లేదని స్పష్టం చేసింది. 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య నీటిని పంచింది. అలాగే, నీటి వినియోగం కోసం కెనాల్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 1982 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలోనే కెనాల్ నిర్మాణం ప్రారంభమైంది. అప్పట్లో శిరోమణి అకాలీదళ్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా దిగింది. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శిరోమణి అకాలీదళ్ చీఫ్ హర్‌చంద్ సింగ్ లొంగోవాల్‌తో చర్చించారు. నీటి పంపకంపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంతకాలు చేశారు. ఆ ఒప్పందంపై సంతకం చేసిన నెల రోజుల్లోనే కొందరు మిలిటెంట్లు హర్‌చంద్‌ను హత్య చేశారు. అనంతరం కాలంలో 1990లో ఈ కాలువకు సంబంధించిన చీఫ్ ఇంజినీర్ ఎంఎల్ శేఖ్రి, సూపరింటెండింగ్ ఇంజినీర్ అవతార్ సింగ్ ఔలఖ్‌ను కూడా మిలిటెంట్లు హత్య చేశారు.
కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా సీఎంలతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో అమరీందర్ సింగ్ మరోసారి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును నొక్కి చెప్పారు. మళ్లీ కొత్తగా నీటి లభ్యతను లెక్కించాలని స్పష్టం చేశారు. యమునా నుంచి వచ్చే నీరు మొత్తం పంజాబ్‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హర్యానా ముఖ్యమంత్రితో కూర్చుని చర్చించేందుకు కూడా తాను సిద్ధమేనన్నారు. ‘నీళ్లు ఉంటే ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం’ అని అమరీందర్ సింగ్ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించుకుంటూనే కెనాల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని గజేంద్ర సింగ్ షెకావత్ ప్రతిపాదించినట్టు తెలిసింది. మరోవైపు ఇదే అంశంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి చండీగఢ్‌లో సమావేశం అవుతారని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.