Punjab to restore security to VIPs : ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా(Sidhu Moosewala) దారుణ హత్య సంచలనం సృష్టించింది. శాంతిభద్రతల కారణాలు చూపుతూ ఇటీవలే సిద్ధూ మూసేవాలా సహా 424 ప్రముఖుల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పంజాబ్(Punjab)ప్రభుత్వం ప్రకటించింది. వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ఉన్నారు. ఆ మరుసటి రోజే మే 29న సాయంత్రం మాన్సా జిల్లాలో సిద్ధూ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. భద్రత కుదింపుతోనే ఈ ఘటన జరిగిందంటూ.. భగవంత్ మాన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని, మాన్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఒ.పి.సోని తన భద్రత కుదింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేయాలని అందులో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా పంజాబ్ సర్కార్ గతంలో తాను తీసుకొన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. పంజాబ్లో ఇటీవల తాత్కాలికంగా భద్రతను కుదించిన 424 మంది ప్రముఖులకు జూన్ 7వ తేదీ నుంచి మళ్లీ పూర్తిస్థాయి భద్రత కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, హర్యాణా హైకోర్టుకు గురువారం తెలిపింది. జూన్ 7 నుంచి భద్రత పునరుద్ధరణ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ALSO READ Sonia Gandhi : సోనియా గాంధీకి కరోనా..అయినా ఈడీ విచారణకు!
సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) జూన్ 17, 1993న జన్మించిరు. ఆయన మాన్సా జిల్లాలోని మూసే వాలా గ్రామానికి చెందినవాడు. మూసే వాలాకు మిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్నారు. అతని ర్యాప్‌కు ప్రసిద్ధి చెందింది. మూస్ వాలా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. కాలేజీ రోజుల్లో సంగీతం నేర్చుకున్న అతను ఆ తర్వాత కెనడాకు వెళ్లాడు. కాగా, మూస్ వాలా అత్యంత వివాదాస్పద పంజాబీ గాయకులలో (Punjabi singer) ఒకరిగా కూడా పేరు పొందారు.
తుపాకీ సంస్కృతిని బహిరంగంగా ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే పాటల్లో గ్యాంగ్‌స్టర్‌లను కీర్తిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో విడుదలైన అతని పాట 'జట్టి జియోనే మోర్ ది బందూక్ వార్గీ', 18వ శతాబ్దానికి చెందిన సిక్కు యోధుడు మై భాగో గురించి వివాదానికి దారితీసింది. ఈ సిక్కు యోధుడిని పేలవంగా చూపించారని ఆరోపించారు. మూసే వాలా తర్వాత క్షమాపణలు చెప్పారు. గత ఆదివారం మాన్సా జిల్లాలోని తన గ్రామ సమీపంలో ఇద్దరు స్నేహితులతో మహేంద్ర థార్ వాహనంలో వెళ్తున్న సిద్ధూ మూసే వాలాను సుమారు పది మంది చుట్టుముట్టి కాల్చారు. సిద్ధూ మూసేవాలా మృతదేహంపై 19 తూటా గాయాల గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhagwant Mann, Punjab, Security