రైతుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండిన పంజాబ్ లో సంచలన ఫలితాలు వస్తున్నాయి. గురువారం వెల్లడైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్నట్లుగా కనిపిస్తోంది. పంజాబ్ లో ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు అధికారం కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైనట్లుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో ఆప్ మెజార్టీ మార్కు(59)ను దాటేసింది. 70కిపైగా స్థానాల్లో ఆప్ లీడ్ లో ఉంది.
పంజాబ్ మొత్తం 117అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ మార్క్ దాటింది. తాజా రిపోర్ట్ ప్రకారం 75 స్థానాల్లో ఆమ్ ఆద్మీ లీడింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. పాటియాలా అర్బన్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు. లంబీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు. శిరోమనీ అకాలీదళ్ నేత గనివీ కౌర్ మంజిత లీడింగ్‌లో ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం అమృత్ సర్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ లో సీఎంల మార్పు, అవినీతి ఆరోపణలు పార్టీ కొంపముంచినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 19 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ.. గడిచిన 5ఏళ్లు పంజాబ్ లో క్రమంగా విస్తరిస్తూ ఇవాళ జయకేతనం దిశగా వెళుతోంది. ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ ముందంజలో ఉన్నారు.
ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం పంజాబ్ లో 75 స్థానాల్లో ఆప్ లీడ్ లో కొనసాగుతుండగా, కాంగ్రెస్ కేవలం 16 సీట్లలోనే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. బీజేపీ 4 సీట్లలో, రైతుల కోసం బీజేపీ దోస్తీని వీడిన శిరోమణి అకాలీదళ్ 8 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. పంజాబ్ లో ఆప్ విక్టరీ ఖాయంగా కనిపిస్తోంది
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.