ఐదో తరగతి పూర్తి చేస్తే రూ.5వేలు.. పదో తరగతి విజయవంతంగా పాస్ అయితే రూ.15 వేలు.. అంతేకాదు, ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 12 పాస్ అయినట్లయితే ఏకంగా రూ.20వేలు ఉచితంగా అందజేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ లో మరి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముందస్తుగా భారీ హామీలను గుప్పించారాయన. సోమవారం నాడు జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ సిద్ధూ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే, చదువుల కోసం ఉచితంగా డబ్బులు కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇస్తామని, బాలికా విద్యను ప్రోత్సహించడానికే తామీ ఆలోచన చేశామని ఆయన వివరించారు. అంతేకాదు..
పంజాబ్ లో బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు గరిష్టంగా రూ.20వేలు నగదు సాయం అందిస్తామన్న నవజ్యోత్ సిద్దూ.. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలకు కంప్యూటర్ ట్యాబ్లెట్లనూ ఉచితంగా సరఫరా చేస్తామని మాటిచ్చారు. ప్రస్తుతం పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటం, ఆ పార్టీకి సిద్ధూనే చీఫ్ గా ఉండటంతో ఆయన హామీలకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. అదీగాక,
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా కోసం ప్రయత్నిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆమ్ మహిళలకు ఇచ్చిన వాగ్ధానానికి పోటీగా కాంగ్రెస్ చీఫ్ సిద్దూ ఏకంగా అమ్మాయిలకు రూ.20వేలు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం గమనార్హం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓట్లేయడం ద్వారా అమ్మాయిలకు నగదు సాయం పథకాన్ని పొందొచ్చన్నారు సిద్దూ. మేనిఫెస్టో ప్రకటన నాటికి ఇలాంటి పథకాలు మరిన్ని రూపొందిస్తామని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Cash, Congress, Navjot Singh Sidhu, Punjab, Students