PUNJAB CM CHANNI NEPHEW RAIDED BY ED IN ILLEGAL SAND MINING CASE BEFORE ELECTIONS CONGRESS SLAMS BJP MKS
Punjab Elections 2022: ఎన్నికల వేళ షాక్: సీఎం చన్నీ సమీప బంధువులపై ED దాడులు..
సీఎం చన్నీ బంధువులపై ఈడీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ సమీప బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. అక్రమ ఇసుక మాఫియా వ్యవహారంలో సీఎం చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ, మరికొందరు బంధువులే టార్గెట్ గా ఈడీ సోదాలు చేపట్టింది.
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థ భారీ షాకిచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ సమీప బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. సీఎం చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ, మరికొందరు బంధువులే టార్గెట్ గా ఈడీ మంగళవారం నాడు సోదాలు చేపట్టింది. ఇసుక అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి వ్యవహారంలో సీఎం బంధువులకు చెందిన కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తాజా దాడులు తలపెట్టింది. కాగా, ఈడీ దాడుల ద్వారా పంజాబ్ లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు..
ఐదునదుల రాష్ట్రంగా వర్ధిల్లుతోన్న పంజాబ్ లో ఇసుక మాఫియా పీడ చాలా కాలంగా ఉంది. ఇసుక మాఫియాతో సీఎం చన్నీ, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీలు తరచూ ఆరోపిస్తుండటం తెలిసిందే. ఇసుక మాఫియాపై గతంలో నమోదైన పలు కేసుల దర్యాప్తులో భాగంగా ఇవాళ ఈడీ పంజాబ్ సీఎం బంధువులను టార్గెట్ చేసింది.
పంజాబ్ లో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న కంపెనీలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. సీఎం చన్నీ మేనల్లుడు భూపీందర్ హనీతోపాటు పలువురికి చెందిన 10-12 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు మొదలుపెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారమే సోదాలు జరుపుతున్నట్లు ఈడీ వర్గాలు న్యూస్-18కు వెల్లడించాయి.
అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడైన కుద్రత్ దీప్ సింగ్ కంపెనీలతో సీఎం చన్నీ మేనల్లుడు భూపీందర్ కంపెనీలకు ఆర్థిక లావాదేవీలు సాగాయని, భూపీందర్ సింగ్ హనీ పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఒక కంపెనీని స్థాపించారి, నవాషహర్లోని మాలిక్పూర్ క్వారీని అక్రమంగా ఆ సంస్థకు కేటాయించారనే ఆరోపణలున్నాయి. కాగా, ఎన్నికల వేళ కాంగ్రెస్ ముఖ్యనేతల బంధువులపై ఈడీ దాడులు చేయడంపై ఆ పార్టీ నేతలు అనూహ్యంగా స్పందించారు.
ఈడీ దాడుల ద్వారా బీజేపీ తన పంజాబ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిందని యువజన కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుంది. పంజాబ్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లోనూ బీజేపీ విరోధి అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సన్నిహితులపై కేంద్ర సంస్థలు ఇటీవల దాడులు నిర్వహించడం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.