మంత్రి పదవి చేపట్టి ముచ్చటగా మూడు నెలలైనా కాలేదు.. ఆరోగ్య శాఖలో ఆమ్యామ్యాలు ఎలా వసూలు చేయాలో ఇంకా పూర్తిగా తెలుసుకోనేలేదు.. పైగా పర్సంటేజీ కూడా మిగతా రాష్ట్రాలు, ఇతర పార్టీల మంత్రుల కంటే చాలా చాలా తక్కువ.. తన పరిధిలో సాధ్యమైనంత గోప్యత కూడా పాటించాడు.. కానీ పాపం చివరికి అడ్డంగా దొరికిపోయాడు.
ఆరోగ్య శాఖకు సంబంధించిన కాంట్రాక్టుల్లో 1 శాతం కమీషన్ తీసుకున్నాడనే ఆరోపణలపై పంజాబ్ మంత్రి పదవిని కోల్పోయాడు. (Punjab Health Minister Vijay Singla Sacked Over Corruption Charges) అంతేకాదు, సర్కారు వారే కేసు పెట్టడంతో పాపం అరెస్టు కూడా అయ్యారు. అవినీతి సహించలేనిదే అయినప్పటికీ, ధనస్వామ్యం బాగా విస్తరించిన ప్రస్తుత పొలిటికల్ సినారియోలో ఈ తరహా ఘటన సంచలనంగా మారింది. వివరాలివే..
పంజాబ్ లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తన పరిపాలనలో అవినీతికి చోటివ్వబోనని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా.. లంచాల ఉదంతంలో మొట్టమొదటి నిందితుడిగా సొంత పార్టీ మంత్రినే జనం ముందు నిలబెట్టింది. అవినీతి ఆరోపణలపై పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా పదవి కోల్పోయారు. కేబినెట్ నుంచి మంత్రిని తొలగిస్తూ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. పదవి కోల్పోయిన కాసేపటికే అవినీతి కేసులో విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు.
‘మా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తోన్న విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడుతున్నట్లు పక్కాగా ఆధారాలు లభించాయి. తన శాఖ పరిధిలో జరిగే పనులకు సంబంధించి టెండర్లలో ఆయన 1 శాతం కమీషన్ పొందుతున్నట్లు విచారణలో తేలింది. తక్షణమే ఆయనను పదవిలో నుంచి తొలగిస్తున్నాం. అతేకాదు, ఆయా సెక్షన్లను అనుసరించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం..’ అంటూ ఆరోగ్య మంత్రి తొలగింపుపై సీఎం భగవంత్ మాన్ వివరణ ఇచ్చారు.
ఈ ఏడాది మార్చిలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పంజాబ్ లో ఆప్ అద్భుతమైన విజయాన్ని సాధించడం తెలిసిందే. 117 స్థానాలకు గానూ ఏకంగా 92 సీట్లలో ఆప్ గెలుపొందగా, సీనియర్ నేత భగవంత్ మాన్ సీఎం పదవి చేపట్టారు. అవినీతి నిర్మూలనకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్న విధంగానే సొంత మంత్రినే తొలగించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో నిజాయితీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే నిదర్శనమని, తప్పుచేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమనడానికి పంజాబ్ మంత్రి తొలగింపు మరో ఉదాహరణ అని ఆప్ నేతలు ప్రకటనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Bhagwant Mann, Punjab