PUNE VIZAG STEEL PLANT TO SUPPLY LIQUID OXYGEN THROUGH OUT IN INDIA NGS
Andhra Pradesh: ఊపిరి తీయాలని చూస్తే ఊపిరి పోసింది.. అయిననూ మనసు మారదు అంటున్న కేంద్రం
దేశానికి ఊపిరి పోస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్
తన విలువ ఏంటో కేంద్రానికి తెలిసేలా చేస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్, దేశ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. నేను ఉన్నాను అంటూ భారీగా అందరికీ ఆక్సిజన్ అందిస్తోంది. మరి ఇది చూసైనా కేంద్రం మనసు కరుగుతుందో లేదో చూడాలి. కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణపై నిర్ణయం పూర్తైనట్టు సమాచారం. త్వరలో అధికార ప్రకటన రావడమే లాంఛనమంటున్నారు.
వద్దని అనుకున్నారు. కానీ ఇప్పుడు దేశానికి అదే ఊపిరి పోస్తోంది. నష్టాల్లో ఉందనే సాకుతో ఆ ఊపిరి తీసేయాలని అడుగులు వేశారు. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆక్సిజన్ ఇచ్చి ఆదుకుంటోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ లక్షల్లో విజృంభిస్తోంది. ప్రతి రోజు రెండు లక్షలుకుపైగా కేసులు పెరుగుతున్నాయి. అయితే తొలి దశలోనే కంటే.. సెకెండ్ వేవ్ లో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో కరోనా పేరు ఎత్తితినే అటు ప్రభుత్వాలు, వైద్యులు, ప్రజలు అంతా గజగజా వణికే పరిస్థితి ఏర్పడింది.
లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు భయపెడుతున్నాయి. చాలామంది కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు లేక గత కొన్ని రోజుల నుంచి పదుల సంఖ్యలో కరోనా బాధితులు మరణించారు. ఇలాంటి సమయంలో అందరికీ ఊపిరి పోసేందుకు నేను ఉన్నాను అంటూ స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చింది. ఓ వైపు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం వదిలించుకోవాలి అనుకుంటోంది. ప్రస్తుతం ప్లాంట్ లో భారీగా ఉత్పత్తి జరుగుతోంది. దేశంలోనే రికార్డు స్థాయి ఉత్పత్తి జరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఆదాయం పరంగానూ లాభాల్లోనే ఉంది. అయినా కేంద్రం మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణవైపే అడుగులు వేస్తోంది.
కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యమం ఉవ్వెత్తు ఎగసి పడుతోంది. రోజు రూపంలో కార్మికులు తమ నిరసన తెలుపుతున్నారు. ఒకసారి ఏపీ బంద్, మరోసారి భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. 50 రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. ఓ వైపు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూనే కార్మికులు విధుల్లో పాల్గొంటున్నారు. మధ్య మధ్యలో నిరసనల్లో పాల్గొంటూ.. విధులను కొనసాగిస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. వారి పట్టుదలతో ప్లాంట్ లాభాల బాట నడుస్తోంది అయినా ప్రభుత్వం మనసు మారడం లేదు.
దేశం మొత్తం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనూవిశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం అత్యధికంగా సహజ వాయువును ఉత్పత్తి చేస్తోంది. కష్టసమయంలో ఎందరికో ప్రాణదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ప్రతి రోజూ 100 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అత్యవసర అవసరాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని.. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ కోసం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుకర్మాగారాలపైనే ఆధారపడుతున్నాయి. ఏపీలో మూడో వంతు ఆస్పత్రులకు విశాఖ నుంచే ఆక్సిజన్ సరఫరా అవుతుండగా.. అదనంగా మహారాష్ట్రకు 150 టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ సరఫరా చేస్తోంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉక్కు కర్మాగారం మరికొన్ని రాష్ట్రాలకు ప్రాణవాయువును సరఫరా చేయనుంది. ఇప్పటికే 400 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరం 8 వేల 842 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. సాధారణంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఆక్సిజన్ తయారీ యూనిట్‌లు ఉన్నాయి. ఈ యూనిట్లల్లో 24 గంటలూ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం దాదాపు మూడు వేలు ఉంది. ఇందులో 2,700 టన్నులు వాయురూపంలో ఉండగా, 250 టన్నులు ద్రవరూప ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తారు. అంతే సరాసరిన ప్రతి రోజూ గరిష్ఠంగా 2 వేల 800 టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది.
ఇందులో 100-150 టన్నుల వరకు ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ అవసరాలకే సరిపోతోంది. అయితే వీటిలో రోజుకి 50 నుంచి 60 టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ను కొవిడ్ ఆస్పత్రులు, ఇతర అవసరాల కోసం సరఫరా చేస్తోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రోజుకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం ఉందని విశాఖ ఉక్కు వర్గాలు పేర్కొంటున్నాయి. దీని కోసం మహారాష్ట్ర నుంచి నేరుగా ప్రత్యేక ఆక్సిజన్ సరఫరా కోసం ట్రైన్ కూడా ఏర్పాటు చేసింది కేంద్రం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.