Andhra Pradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెడికల్ ఆక్సిజన్ ఎలా తయారవుతుందో తెలుసా? ఆక్సిజన్ కు మెడికల్ ఆక్సిజన్ కు తేడా ఏంటి?

దేశానికి బారీగా ఆక్సిజన్ సప్లై చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్

ఊపిరి తీయాలని కేంద్రం చూస్తుంటే.. కేంద్రానికే ఇప్పుడు ఊపిరి పోస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్, నష్టాల్లో ఉందనే సాకుతో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఇఫ్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తూ బాహుబలిగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం ఊపిరి తీసేస్తుంటే ఎంతో మందికి ఊపిరి అందిస్తోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి ప్రాణ దానం చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను సరఫరా చేస్తోంది. కరోనా రోగులకు ఎంతో అవసరమైన, వారి ప్రాణాలను కాపాడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తోంది.

    లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుంటోంది. కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో గతేడాది కూడా స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.

    అసలు మెడికల్ఆక్సిజన్ అంటే ఏంటి?
    కోవిడ్ -19 బాధితుల చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ చాలా కీలకంగా మారింది. సాధారణంగా ఆక్సిజన్‌ను ప్రాణవాయువు అంటాం.. అన్నట్లుగానే ఇప్పుడు అది కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడడానికి చాలా కీలకం అవుతోంది. అయితే, దీని పారిశ్రామిక అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే భారీ పరిశ్రమల్లో ఆక్సిజన్ తయారీ యూనిట్లు ఉంటాయని ఇండస్ట్రియల్ పొల్యూషన్ టెస్టింగ్ సీనియర్లు చెబుతూ ఉంటారు. 

    ఉక్కు, ఇనుము, మందుల తయారీ కంపెనీలలో ఈ ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఆయా పరిశ్రమలు తమ సొంతంగా యూనిట్లు పెట్టుకుని అవసరమైన ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను తయారు చేసుకుంటాయి. స్టీల్ ప్లాంట్‌లో కూడా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ యూనిట్ ఉంది. దీనిలో తయారైన ఆక్సిజన్‌లో కొంత భాగాన్ని ఇతర అవరాల కోసం లిక్విడ్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తారు. దీనినే వైద్య పరిభాషలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అంటారు. అంటే సాధారణ ఆక్సిజన్ లో ఉంచే చిన్నచిన్న మలినాలను తీసి ప్యూరిఫై చేసి మెడికల్ లక్విడ్ ఆక్సిజన్ ను రూపొందిస్తారు.

    సాధారణంగా మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 20.95 శాతం, నెట్రోజన్ 78 శాతం, అలాగే స్వల్ప మోతాడులో ఆర్గాన్, నియాన్, కార్బన్ డైయాక్సెడ్, హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. చుట్టూ ఉన్న గాలిలో అవి కాస్త ఎక్కువ లేదా తక్కువ అయినా, వేరే ఏ వాయువులు కలిసినా వెంటనే అక్కడ ఉండే మనుషులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్ అసవరాలకు స్వచ్చమైన ఆక్సిజన్‌నే వాడతారు. పరిశ్రమల్లో తయారైయ్యే ఆక్సిజన్ 95 నుండి 99 శాతం వరకూ చాలా నాణ్యతతో ఉంటుంది. కొంత మలినాలతో కూడిన వాయువులు అందులో ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్‌ను పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేస్తారు. దానిలో ఇతర వాయువులు ఏవీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మనిషి శ్వాసకు ఉపయోగపడే వాయువులా దీన్ని మార్చడంతో దీనిని మెడికల్ ఆక్సిజన్ అంటారు.

    తాజాగా కరోనా విస్తరణ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్, టాటా స్టీల్, జేఎస్పీఎల్, జేఎస్ డబ్యూ స్టీల్ లాంటి ఉక్కు కర్మాగారాలతోపాటూ మిగతా ఆక్సిజన్ తయారీ యూనిట్లు కూడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాయి. గతేడాది కూడా ఆక్సిజన్‌ను విజయవంతంగా ఆసుపత్రులకు సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్‌.. ఇప్పుడు ఉత్పత్తిని రెట్టింపు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా సరఫారా చేస్తోంది.

    ఇనుము, ఉక్కు తయారు చేసే పరిశ్రమల్లో ఆక్సిజన్ అవరసం ఎప్పుడూ ఉంటుంది. పరిశ్రమ అవసరాల కోసం తయారయ్యే ఆక్సిజన్‌ను ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ అంటారు. దీనిని రోలింగ్ మిల్స్, ఫర్నేస్, స్టీల్‌ను వివిధ ఆకారాల్లో కట్ చేయడానికి, ఎస్ఎంఎస్ ప్లాంట్, లేజర్ సెట్టింగ్ లాంటి వాటికి, అలాగే వివిధ ప్రాసెసింగ్ వ్యవస్థల దగ్గర ఇగ్నిషియన్ కోసం ప్రతి చోటా వాడుతుంటారు. ఈ అవసరాల కోసం స్టీల్ ప్లాంట్‌లో అతి పెద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. దీనిని ఎయిర్ సెపరేషన్ ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. దీని ద్వారా నెలకు దాదాపు 8 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.

    సాధారణంగా ఇది ప్లాంట్ కెపాసిటీ కంటే తక్కువే. అవసరం మేరకే ఉత్పత్తి చేస్తారు. తాజాగా కేంద్రం ఆదేశాలతో దానిని మరింత పెంచుకోవచ్చు. ఆ కెపాసిటీ విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఆక్సిజన్ ప్లాంట్‌కు ఉంది. గతేడాది కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రులకు 6 వేల నుంచి 8 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారు. ఇప్పుడు రెట్టింపు అంవుతోంది.

    స్టీల్ ప్లాంట్‌ అవసరాల కోసం ఏడాదికి లక్ష టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్‌లోని ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకి 100 టన్నుల నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. దీని సామర్ద్యం ఎక్కువగా ఉన్నప్పటీకి... అవసరాల మేరకే ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో కొంత భాగాన్ని మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తున్నారు. అది ప్లాంట్‌లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆసుపత్రులకు సరఫరా చేయడానికి దీన్ని ఎక్కువ తయారు చేయాల్సి వస్తోంది. ఏపీ, తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు గత నాలుగు రోజులుగా దాదాపు 500 టన్నుల వరకు పంపించినట్టు తెలుస్తోంది. కేంద్రం ఉత్పత్తి, సరఫరా పెంచమని చెప్పడంతో దీన్ని త్వరలో మరింత పెంచుతామంటున్నారు స్టీల్ ప్లాంట్ అధికారులు.

    ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అందుతున్నలెక్కల ప్రకారం ప్రతి వందమంది కరోనా రోగుల్లో 20 మందిలో తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయి. వారిలో ముగ్గురికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఉంటోంది. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని వైద్య అవసరాల కోసమే ఉపయోగిస్తున్నాయని కేజీహెచ్ వైద్యులు అంటున్నారు. గతేడాది కరోనా మొదటి దశలో కేజీహెచ్ లో ప్రత్యేకమైన కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. అప్పుడు ఆక్సిజన్ అసవరం చాలా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు అందేవి. ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో గత ఐదు రోజులుగా స్టీల్ ప్లాంటే ఆక్సిజన్ సప్లై చేస్తోందని అంటున్నారు. అలాగే ముందస్తుగా కేజీహెచ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు స్టాకు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
    Published by:Nagesh Paina
    First published: