బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైతం మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇదివరకు మహారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల రుణాలు మాఫీ చేయించారు. యూపీలోని రైతు కుటుంబాలకి చెందిన వారి లోన్స్ మాఫీ కోసం రూ.4.05 కోట్లు ఖర్చు పెట్టారు. తాజాగా పుల్వామా దాడిలో చనిపోయిన 49 మంది వీరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున విరాళంగా మొత్తం రూ.2.5 కోట్లు ప్రకటించారు. హర్యానా పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగి అయిన స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ఒక నెల జీతాన్ని అమరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు.
ఏపీ ప్రభుత్వం ఒక్కో అమర జవాన్ కుటుంబానికీ రూ.5లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. జవాన్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో అమర జవాన్లకు సంతాపంగా మౌనం పాటించారు.
జవాన్ల పిల్లలను చదివిస్తానన్న సెహ్వాగ్ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ సైనికుల పిల్లల్ని చదివించే బాధ్యతను టీంఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీసుకున్నాడు. అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువేనన్న వీరూ... తాను వారి పిల్లల్ని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తానని ట్విట్టర్లో తెలిపాడు.
అమర వీరుల కుటుంబాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. తన చెక్కుతోపాటూ... తన ఫ్రెండ్స్ ఇచ్చిన మరో 25 లక్షల చెక్కును హైదరాబాద్‌లోని సదరన్ సెక్టార్ CRPF ఆఫీస్‌లోని ఐజీపీ GHP రాజును కలిసి ఇచ్చారు. ఈ సందర్భంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన స్థానిక సీఆర్పీఎఫ్ సిబ్బందితో మాట్లాడారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఆర్థిక సాయం చేసినా... అది ఎంత అన్నది బయటపెట్టలేదు.
ఈ యువ హీరో ఇది వరకు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి సాయాలు ప్రకటిస్తూ... రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.
మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
Published by:Krishna Kumar N
First published:February 17, 2019, 13:16 IST