PRIYANKA GANDHI GANGA YATRA WILL GIVE SUCCESS TO CONGRESS IN UP ELECTIONS 2019
ప్రియాంక గాంధీ "గంగా యాత్ర" వ్యూహం ఫలించిందా ?
Priyanka
Priyanka gandhi Ganga Yathra | ఉత్తరప్రదేశ్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగిన వర్గాలను చేరదీసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేపట్టిన మూడురోజుల గంగాయాత్ర అక్కరకు వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడంలో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ చేపట్టిన 3 రోజుల గంగా యాత్ర చివరిరోజుకి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల వేటలో భాగంగా మొదలైన గంగా యాత్రలో ప్రియాంక గాంధీ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రయాగ్‌రాజ్ నుంచి వారణాసి వరకూ చేపట్టిన ఈ గంగాయాత్రలో తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రియాంక గట్టి ప్రయత్నమే చేశారు. ముఖ్యంగా యాత్రలో భాగంగా ప్రియాంక పలు దేవాలయాల సందర్శనతో పాటు పలు వర్గాలకు చెందిన ప్రజలతో మమేకమవుతూ ముందుకు కదలారు. తనకు స్వాగతం పలికేందుకు గంగా నదీ ఒడ్డకు వచ్చిన వేలాది మందికి అభివాదం చేస్తూ యాత్రను సాగించారు. గడిచిన మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగిన వర్గాలను చేరదీసేందుకు ప్రియాంక గాంధీ చేపట్టిన గంగాయాత్ర ఉపయోగ పడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గంగా యాత్రతో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రియాంక...యావత్ దేశం దృష్టిని తన వైపునకు మల్లించుకోవడంలో సఫలీకృతమయ్యారు.
ప్రియాంక గాంధీ గంగా షికారు
మొదటి రోజు దశాబ్ధాల క్రితం తన నాన్నమ్మ ఇందిరాగాంధీ గతంలో పూజలు చేసిన ప్రయాగ్ రాజ్‌లోని బడే హనుమాన్ మందిర్ దర్శనంతో ప్రారంభమైన ప్రియాంక గంగా యాత్రలో ఇటీవలే బీజేపీ నుంచి దూరం జరిగిన ఎంపీ సావిత్రి బాయి ఫూలే పాలుపంచుకోవడం విశేషం. ప్రతిపక్ష పార్టీలు ప్రియాంకపై విమర్శలు గుప్పించాయి. ఎన్నికల ప్రచారం గాంధీ కుటుంబానికి పిక్నిక్ లా మారిందని గంగాయాత్రపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ప్రియాంక వాటిని తిప్పిగొట్టడంలో పరిణితి సాధించారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
వారణాసిలో సైతం పర్యటించిన ప్రియాంక గాంధీ మోడీ ప్రభుత్వంపై సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని విమర్శించారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రియాంక గంగా యాత్ర సాగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ గురించి ప్రియాంక పర్యటనలో గుర్తుచేశారు. అంతే కాదు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రియాంక వినూత్నంగా బోట్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను ఫోకస్ చేయడం ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. గంగా తీర ప్రాంతాల్లో మత్స్యకారుల కుటుంబాలను సైతం ప్రియాంక నేరుగా కలిశారు. అలాగే వారణాసిలో నివాసం ఉంటున్న పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలను సైతం ప్రియాంక సందర్శించారు. మొత్తం 140 కిలోమీటర్ల దూరం వరకూ కొనసాగిన గంగా యాత్ర ప్రియాంక నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు దోహదపడిందనే చెప్పవచ్చు.
బోట్ పే చర్చలో ప్రియాంక
ఇదిలా ఉంటే మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ బలమైన రాజకీయ పక్షంగా నిలబడితే, మరోవైపు ఎస్పీ, బీఎస్పీ పొత్తు సందర్భంగా కాంగ్రెస్‌ను పరిగణలోకి తీసుకోకపోవడం ఒక రకంగా యూపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా నిలిచింది. ఈ ప్రతికూలతల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు ప్రియాంక చేపట్టిన గంగా యాత్ర దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ పరిభాషలో హస్తినకు యూపీ దగ్గరిదారి. 80 లోక్‌సభ నియోజకవర్గాలు కలిగిన యూపీలో ఎవరు పైచేయి సాధిస్తే...వారికే కేంద్రంలో అధికారం వశమవుతుంది. యూపీలో ఈ సారి సార్వత్రిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోవడం లేదని తన యాత్ర ద్వారా ప్రియాంక గాంధీ చెప్పకనే చెప్పారు.
మూడు దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన స్థాయికి దిగజారింది. సాక్షాత్తూ పార్టీ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నానాటికీ దిగజారిపోవడం ఆందోళనకరంగా మారింది. అయితే గడిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ వ్యతిరేకత దేశంలో బలంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గంగా యాత్ర చేపట్టిన తూర్పు యూపీ నుంచే సాక్షాత్తూ ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు యూపీలో గెలిచిన సింహభాగం సీట్లే కారణమయ్యాయి. మరోవైపు గతకొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సోనియా లోటును ప్రియాంక భర్తీ చేస్తారని కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రియాంక గాంధీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపుతారో సార్వత్రిక ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.