భారతదేశంలో వ్యవసాయం తర్వాత.. ఎక్కువ మంది పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పాడి పరిశ్రమకు(Dairy Industry) అనుబంధంగా ఉన్న రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు సబ్సిడీలు(Subsidy) కూడా అందిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఎనిమిదేళ్లలో భారత్ పాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చెప్పారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి పర్షోత్తం రూపాలా చేసిన ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా గత ఎనిమిదేళ్లలో పాల ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందిందని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు డైరీ రంగంపై దృష్టి పెట్టి స్వయం సమృద్ధి సాధించాలని కోరారు.
* 83 మెట్రిక్ టన్నులు పెరిగిన పాల ఉత్పత్తి
గత ఎనిమిదేళ్లలో పాల ఉత్పత్తిలో స్మారక వృద్ధి నమోదైందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి పర్షోత్తం రూపాలా చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కేవలం 8 సంవత్సరాలలోనే పాల ఉత్పత్తి 83 MT మేర పెరిగిందని, అంతకుముందు 63 ఏళ్లలో ఇది 121 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేదని, పాడి పరిశ్రమపై ఆయనకున్న మక్కువ, దూర దృష్టికి ఇది నిదర్శనమని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రి ట్వీట్‌ను ట్యాగ్ చేసిన మోదీ.. ఇది చాలా సంతోషకరమని, నారీ శక్తిని మరింత బలోపేతం చేయడానికి శక్తివంతమైన డెయిరీ రంగం కూడా గొప్ప మార్గమని ట్వీట్ చేశారు. రాబోయే కాలంలో పాడి పరిశ్రమ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్న ట్లు చెప్పారు.
* లంపీ వైరస్ కట్టడికి స్వదేశీ వ్యాక్సిన్
సెప్టెంబర్‌లో నోయిడాలో జరిగిన ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాడీ పరిశ్రమపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 8 ఏళ్లలో పాల ఉత్పత్తిలో 44 శాతం వృద్ది జరిగిందని పేర్కొన్నారు. 2014 నుంచి దేశ పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. దీని ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ప్రస్తుతం 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని, 8 కోట్ల కుటుంబాలు పాల ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.
పశువుల్లో ప్రబలుతున్న లంపీ చర్మ వ్యాధి కట్టడికి స్వదేశీ వ్యాక్సిన్లను భారత్ అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్ ప్రీ మార్కెట్ దశలో ఉందని, విస్తృతంగా దేశంలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లక్షలాది పశువులకు లంపీ చర్మవ్యాధి సోకిందని, దాని కారణంగా వందలాది జీవాలు మృత్యువాత పడ్డాయని గుర్తు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.