Chandrayaan-2 : ఆత్మస్థైర్యం కోల్పోవద్దు... ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు...

Chandrayaan-2 : ఆత్మస్థైర్యం కోల్పోవద్దు... ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు...

నరేంద్ర మోదీ (Image : Twitter - ANI)

ISRO Chandrayaan-2 : చంద్రయాన్-2 విషయంలో ఇస్రోకు దేశంలోని ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు.

  • Share this:
ISRO Chandrayaan-2 : చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శాస్త్రవేత్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్న ఆయన... మరింత కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వెయ్యాలన్నారు. ఇలాంటి అడ్డంకులు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయన్న ఆయన.. వాటికి ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాలన్నారు. ఇస్రో కంట్రోల్ సెంటర్ నుంచీ ప్రసంగించిన ప్రధాని మోదీ... ఈ ప్రయోగం కోసం నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతీ శాస్త్రవేత్తనూ అభినందించారు. శాస్త్రవేత్తల ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఆయన... వారి శ్రమను దేశ ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా చంద్రయాన్ గురించి రాస్తే... ఫెయిలైందని రాయరన్న మోదీ... చివరి క్షణం వరకూ చందమామను చేరుకోవడానికి ప్రయత్నించారనే రాస్తారని అన్నారు.

అంతరిక్ష ప్రయోగాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయన్న మోదీ... వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మరిన్ని లక్ష్యాల్ని సాధించాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు సంతోషించే మరిన్ని విజయాలు భవిష్యత్తులో వస్తాయన్న మోదీ... నెక్ట్స్ టైమ్ మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని చూసి దేశం గర్విస్తోందన్న మోదీ... ఇప్పటివరకూ జరిగిన జర్నీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రమండల యాత్ర కొనసాగుతుందన్న ఆయన.. మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తామన్నారు. ఇప్పటివరకూ ఇస్రో సాధించిన విజయాల్ని గుర్తుచేసిన మోదీ... మరిన్ని ప్రయోగాలు చెయ్యాలనీ, తాను, దేశం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు.


అసలేం జరిగింది : విక్రమ్ ల్యాండింగ్‌లో ఆఖరి 15 నిమిషాలు కీలకమైనవి..అత్యంత క్లిష్టమైనవి..! ఇస్రో ముందు నుంచీ చెప్పిన మాట ఇది..! అందుకు తగ్గట్లే చివరి క్షణాల్లో విక్రమ్‌కు అవాంతరయాలు ఎదరయ్యాయి. ఆ 15 నిమిషాల్లో 14 నిమిషాల పాటు సజావుగా సాగిన విక్రమ్ ప్రయాణం.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ఉన్న ఊహించని సమస్య ఎదురైంది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అనుకునేలోపే.. విక్రమ్ నుంచి కమాండ్ కంట్రలో రూమ్‌కి సంకేతాలు నిలిచిపోయాయి. మరి విక్రమ్ క్రాష్ అయిందా? లేదంటే ల్యాండ్ అయ్యి కేవలం సిగ్నల్స్ మాత్రమే అందడం లేదా? అని అందరిలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ అంచెను విజయవంతంగా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి...గమ్యానికి చేరువలో గతి తప్పింది. ఐతే స్పీడ్ కంట్రోల్ కాక విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిందా? లేదంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాక సిగ్నల్స్ నిలిచిపోయాయా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు డేటా విశ్లేషణ చేస్తున్నారు. ల్యాండర్ పరిస్థితిపై రెండ్రోజుల్లో ప్రకటన చేసే అవకాశముంది.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు