Farm Bills: వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం

President nod to Farm Bills: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

news18-telugu
Updated: September 27, 2020, 7:55 PM IST
Farm Bills: వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం
రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
  • Share this:
Ramnath Kovind nod to Farm Bills: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత, దేశంలో రైతుల నుంచి భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు-2020లను ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఆ మూడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాయి. అయితే, వాటికి ఆమోదం తెలుపవద్దంటూ విపక్షాలకు చెందిన నేతలు రాష్ట్రపతి కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేశాయి. వాటిని మళ్లీ పార్లమెంట్ పునఃపరీశీలను పంపాలని కోరాయి. అయితే, వాటికి ఈరోజు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి.

మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం తెచ్చిన ‘రైతు వ్యతిరేక చట్టం’ని తాము అమలు చేయబోమని ప్రకటించింది. ‘పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రైతు వ్యతిరేకతమైనవి. కాబట్టి మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మహా వికాస్ అగాఢి (మహారాష్ట్రలో శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి) కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ చట్టాన్ని మహారాష్ట్రలో అమలు చేయం. శివసేన కూడా మాతో ఉంది. మేం కలిసి కూర్చుని ఒక వ్యూహాన్ని రూపొందిస్తాం’ అని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలసాహెబ్ టోరట్ అన్నారు.

ఇప్పటికే ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈనెల 25న 31 రైతు సంఘాలు భారత్ బంద్‌ నిర్వహించాయి. వారికి పలు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు పలికాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి తప్పుకొంది శిరోమణి అకాలీదళ్. తాజాగా, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో అక్టోబర్ 1న కిసాన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ‘అక్టోబర్ 1న మొహాలీ వరకు కిసాన్ మార్చ్ నిర్వహిస్తాం. గవర్నర్, రాష్ట్రపతిలకు కూడా వినతిపత్రాలు అందజేస్తాం.’ అని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చెప్పారు. అయితే, ఆయన ప్రకటనచేసిన కొన్ని నిమిషాల్లోనే రాష్ట్రపతి మూడు బిల్లులకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పందించారు. ‘రైతుల ఆవేదన, ఆందోళనలను రాష్ట్రపతి గుర్తించకపోవడం బాధాకరం. దేశంలో రైతుల భావాలకు అనుగుణంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ప్రజాస్వామ్యానికి, రైతులకు చీకటి రోజు’ అని బాదల్ ట్వీట్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2020, 7:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading