నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మకు షాక్... క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేత...

Nirbhaya Case : నిర్భయ కేసులో దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష విధించాల్సి ఉండగా... వినయ్ శర్మ పిటిషన్ కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఆ పిటిషన్ కొట్టివేయడంతో... ఇప్పుడు ఉరి వేసేందుకు వీలవుతోంది.

news18-telugu
Updated: February 1, 2020, 10:59 AM IST
నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మకు షాక్... క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేత...
నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మకు షాక్... క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేత...
  • Share this:
Nirbhaya Case : ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకడైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. తనకు విధించిన ఉరి శిక్షను... యావజ్జీవ శిక్షగా మార్చాలని వినయ్ శర్మ కోరాడు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో... ఈ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష అమలు చేసేందుకు వీలు కలగనుంది. ఈ కేసులో... మొదటి నుంచీ ఉరిశిక్ష అమలవ్వకుండా... దోషులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే... దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ తనకు విధించిన ఉరిశిక్షణను సవాల్ చేస్తూ... సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఇలా ఎన్ని నాటకాలాడినా... ఫిబ్రవరి 1న నలుగురికీ ఉరిశిక్ష అమలు చెయ్యాలని అంతా సిద్ధమైతే... చివర్లో మళ్లీ మెలిక పెట్టారు. ఫలితంగా... శనివారం ఉదయం 6 గంటలకు జరగాల్సిన ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. నెక్ట్స్ తేదీ ఏదనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు.

2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఆమె స్నేహితుణ్ని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ నలుగురు దోషుల ఉరి ఆఖరి క్షణంలో వాయిదా పడింది. ఉరిశిక్ష అమలుపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలన్న దోషుల వాదనను సమర్థిస్తూ... నిరవధికంగా స్టే విధించింది. దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయని కంటతడి పెట్టారు. వారిని ఎలా ఉరితీస్తారో చూస్తానంటూ.. దోషుల లాయర్ సవాల్ విసిరారని ఆమె చెప్పారు.
ఉరిశిక్ష అమలు వాయిదా అంశంపై కోర్టులో దోషుల తరపు లాయర్, తీహార్ జైలు అధికారుల మధ్య వాదనలు జరిగాయి. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే అతడి ఒక్కడి మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని... మిగతా ముగ్గురిని ఉరితీయవచ్చని జైలు అధికారులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. నలుగురి ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేయడంతో... నలుగురికీ ఉరిశిక్ష అమలుకు మార్గం ఏర్పడినట్లే. మరి పాటియాలా కోర్టు ఎప్పుడు శిక్ష విధిస్తుందో తేలాల్సి ఉంది.
First published: February 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు