భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్రకెక్కిన ద్రౌపది ముర్ము (Draupadi Murmu).. గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 74వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఈ నెల 25న రాష్ట్రపతి ముర్ము తన సందేశాన్ని యావత్ దేశానికి వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ఈ నెల 25న (బుధవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇలా రాష్ట్రపతి హోదాలో ఆమె ప్రసంగం చేయడం రెండోసారి కానుంది. గతేడాది జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలకు ద్రౌపది ముర్ము తన తొలి సందేశాన్ని ప్రజలకు వినిపించారు.
ఈ గణతంత్ర వేడుకల సందర్బంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న బృహత్కర కార్యక్రమాల గురించి రాష్ట్రపతి ప్రసంగించే సూచనలున్నాయి. రాష్ట్రపతి ఇచ్చే సందేశం దేశ ప్రజలను ఏకం చేయడమే కాక.. దేశ పురోగతికి చిహ్నంగా నిలుస్తుంది. అందుకే రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రజలకు అమితమైన ఆసక్తి. ఇదొక అపురూప ఘట్టం.
* ఎలా వినాలి?
రాష్ట్రపతి ప్రసంగం నేపథ్యంలో.. ఆమె సందేశాన్ని తిలకించడానికి ఎక్కడికో వెళ్లక్కర్లేదు. టీవీల్లోనే రాష్ట్రపతి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆసక్తి కలిగిన వారు యూట్యూబ్‌లోనూ లైవ్ చూడొచ్చు. భారతీయ కాలమానం ప్రకారం.. జనవరి 25(బుధవారం)న సాయంత్రం 7గంటల నుంచి రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగానున్న అన్ని దూరదర్శన్(హిందీ& ఇంగ్లిష్) ఛానళ్లలో ప్రసారం కానుంది. ఆల్ ఇండియా రేడియోలోనూ ప్రసంగాన్ని ఆలకించొచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు దూరదర్శన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్‌లో చూడొచ్చు. లేదా, రాష్ట్రపతి ప్రసంగంపై న్యూస్ 18 అందించే లైవ్ బ్లాగ్‌ను కూడా మీరు ఫాలో కావచ్చు.
* ఆగస్టు 15 ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలు
2022లో జులైలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారు. అనంతరం ఆగస్టులో రాష్ట్రపతి హోదాలో తొలి ప్రసంగం చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నడుమ రాష్ట్రపతి ప్రసంగం సాగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ ఇనిషియేటివ్‌ని ఆమె కొనియాడారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను దోహదపడతాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారిపై దేశం చేసిన పోరాటం గురించి నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ముర్ము కితాబిచ్చారు.
* అసమానతపై కూడా
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలకు మద్దతు తెలుపుతూనే మరోవైపు దేశంలోని వాస్తవిక పరిస్థితుల గురించి ప్రస్తావించారు. భారత్‌లో ఇప్పటికీ స్త్రీ, పురుషు సమానత్వం, వారి మధ్య భేదాల గురించి ముక్కుసూటిగా మాట్లాడారు. 75ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం ఆమోదయోగ్యం కాదని ముర్ము అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : గణతంత్ర వేడుకల రిహార్సల్స్.. ఫొటోలు చూడండి
మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. మహిళలు అనుకుంటే దైన్నైనా సాధించగలరని నిరూపించడానికి రాష్ట్రపతే నిలువెత్తు నిదర్శనం. ఆనాడు ద్రౌపది ముర్ము ఇచ్చిన సందేశం ఎంతోమంది ఆడపిల్లలకు కొండత ధైర్యాన్ని నూరిపోసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై, దేశంలోని పరిస్థితులపై ప్రసంగించారు. అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు, చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఈ దఫా కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Draupadi Murmu, National News, President of India, Republic Day 2023