PRANAB MUKHERJEE INTERESTING COMMENTS ON MANMOHAN SINGH AND NARENDRA MODI IN HIS AUTOBIOGRAPHY AK GH
Pranab Mukherjee autobiography: మన్మోహన్, మోదీ గురించి ప్రణబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నరేంద్రమోదీ, మన్మోహన్ సింగ్ (పైల్ ఫోటో)
Pranab Mukherjee autobiography: దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని ప్రణబ్ తన ఆత్మకథలో రాశారు.
భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి పదవి విషయంలో ప్రస్తుత ప్రధాని మోదీ, మన్మోహన్ సింగ్లను ఆయన పోల్చారు. మోదీ ప్రధాన మంత్రి పదవిని సాధించగా, మన్మోహన్కు మాత్రం పదవిని కట్టబెట్టారని పేర్కొన్నారు. 2012-2017 వరకు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన జ్ఞాపకాలను ‘ది ప్రెసిడెన్షియల్ ఈయర్స్’ పుస్తకంలో పొందుపరిచారు. ఈ ఆటోబయోగ్రఫీ మంగళవారం విడుదలైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని ప్రణబ్ తన ఆత్మకథలో రాశారు. వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చినవారు దేశానికి ప్రధానులయ్యారని రాశారు. ప్రవర్తన, శైలి, పాలన విధానాల పరంగా ఒక్కొక్కరిదీ భిన్నమైన స్వభావమని ఆయన తెలిపారు. వారిలో కొందరు విభిన్నమైన రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
మోదీ సాధించారు... సింగ్కు వచ్చింది
భారత రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఇద్దరు ప్రధానులతో కలిసి పనిచేసే అవకాశం తనకు వచ్చిందని ప్రణబ్ రాశారు. 2012 జులై నుంచి 2014 మే వరకు మన్మోహన్ సింగ్, 2014 మే నుంచి 2017 జులైలో పదవీ విరమణ చేసే వరకు నరేంద్ర మోదీతో కలిసి ప్రణబ్ పనిచేశారు. వీరిద్దరి పరిపాలన, పాలనా విధానాలను ఆయన తన ఆత్మకథలో ప్రస్తావించారు. ‘మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ ఇచ్చారు. కానీ 2014లో భారీ విజయంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అప్పటి సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీ ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అంతకు ముందే గుజరాత్లో ఎన్నో విజయాలను నమోదు చేసి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజామోదంతోనే మోదీ ప్రధాని పదవిని సాధించారు’ అని ప్రణబ్ రాశారు.
ప్రణబ్ ముఖర్జీ(ఫైల్ ఫోటో)
మన్మోహన్కు ప్రశంసలు
2004 ఎన్నికల్లో UPA విజయం సాధించిన తరువాత సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన సందర్భాన్ని కూడా ప్రణబ్ తన ఆటోబయోగ్రఫీలో గుర్తుచేసుకున్నారు. సోనియాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ, UPAలోని ఇతర పార్టీలు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నా, ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. అప్పట్లో ఆమె విదేశీ మూలాలున్న మహిళ అనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉండేదని ప్రణబ్ పేర్కొన్నారు. ఆ తరువాత మన్మోహన్ సింగ్ను ప్రధాని పదవికి సోనియా ఎంపిక చేశారన్నారు. ఆర్థికవేత్తగా, రాజ్యసభ సభ్యుడిగా, యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసి గుర్తింపు దక్కించుకున్న మన్మోహన్కు దృఢమైన సంకల్పం ఉండేదని రాశారు. అణు ఒప్పందం విషయంలో ఆయన వ్యవహరించిన తీరు బాగుందని, ప్రధానిగా బాగా పనిచేశారని ప్రణబ్ ప్రశంసించారు.