Babri Masjid Demolition Case Verdict: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ తీర్పు చెప్పారు. ఈ కేసులో మొత్తం 2000 పేజీల తీర్పును వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగిందనేందుకు ఆధారాలు లేవని జడ్జి స్పష్టం చేశారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదనీ, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తీర్పులో పేర్కొన్నారు. బాబ్రీ మసీదును కూల్చివేసింది కరసేవకులు కాదనీ... సంఘ విద్రోహ శక్తులు ఆ పని చేశారని తెలిపారు. ఈ కూల్చివేత కేసును కొట్టివేశారు. దీంతో నిందితులందరికీ ఉపశమనం లభించినట్లైంది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా... ఆరోపణలు ఎదుర్కొన్న, బతికివున్న 32 మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా... ఐదుగురు మాత్రమే కోర్టు రూం నెంబర్ 18లో ఉన్నారు. మిగతావారు బయట లాబీలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితోపాటు కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరుకాలేదు. అద్వానీ, జోషీ ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.
All accused in Babri Masjid demolition case acquitted by Special CBI Court in Lucknow, Uttar Pradesh. pic.twitter.com/9jbFZAVstH
— ANI (@ANI) September 30, 2020
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మీద నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా అభివర్ణించారు. ‘హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లను నిర్దోషులుగా తేల్చారు. న్యాయాన్ని అరెస్టు చేసి పాతిపెట్టారు. నవ భారతం.’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
#BabriMasjidDemolitionCase HIT n RUN case .. DRIVERS acquitted.. JUSTICE arrested and BURIED .. NEW INDIA #JustAsking
— Prakash Raj (@prakashraaj) September 30, 2020
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు పూర్వాపరాలు
అయోధ్యలో రామాలయం ఉన్న ప్రదేశంలో... దాన్ని కూల్చి... బాబ్రీమసీదును నిర్మించారనే అంశంతో... ఆ మసీదును కూల్చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. ఒక్కసారిగా బాబ్రీ మసీదును చేరారు. డిసెంబర్ 6న మసీదు ధ్వంసమైంది. దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఆ సమయంలో... పెద్ద ఎత్తున దేశమంతా మత ఘర్షణలు జరిగాయి. వాటిలో 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య రామ జన్మభూమి స్థలం కేసూ... ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కేసూ... రెండూ వేర్వేరు. ఆ కేసులో రామజన్మభూమిలో రామాలయం కట్టుకోవచ్చనే తీర్పు రావడం... దానికి ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ చేశారు.
ఈ కేసులో పోలీసులు 2 FIRలు రాశారు. ఒక దాంట్లో లక్షల మంది కరసేవకులకు వ్యతిరేకంగా కేసు రాశారు. రెండో దాంట్లో... 8 మంది రాజకీయ నేతలకు వ్యతిరేకంగా కేసు రాశారు. ఆ 8 మంది ఎవరంటే... బీజేపీకి చెందిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జ్యోషీ, ఉమా భారతి, వినయ్ కటియార్... విశ్వ హిందూ పరిషత్‌కి చెందిన అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, విష్ణు హరి దాల్మియా, సాథ్వీ రితంభర. వీరిలో దాల్మియా, గిరిరాజ్ కిషోర్, సింఘాల్ చనిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babri masjid, Prakash Raj