POWER SUPPLY CUT OFF IN PIMPRI CHINCHWAD TOWN OF MAHARASHTRA DUE TO ONE CAT 100 CRORE LOOS TO INDUSTRIES SK
Pimpri-Chinchwad: చిన్నపిల్లి ఎంత పనిచేసింది.. ఆ ప్రాంతం మొత్తం కరెంట్ కట్.. రూ.100 కోట్లకు పైగా నష్టం
ప్రతీకాత్మక చిత్రం
విద్యుత్తు పొదుపుగా వాడాలని, భారమంతా సింగిల్ ట్రాన్స్ ఫార్మరు పై పడుతోందని విద్యుత్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ రెండో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు శనివారం వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
వేసవి తాపం (Summer Heat wave) రోజురోజుకూ పెరుగుతోంది. బయటకు అడుగుపెడితే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోతగా ఉంది. భానుడి ప్రతాపంతో జనాలు అల్లాడిపోతుంది. సాధారణంగానే వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కరెంట్ (Power cuts) పోతే ఇంకేమైనా ఉందా? ఫ్యాన్ల, ఏసీలు, కూలర్లు ఆగిపోయి.. శరీరమంతా చెమటతో తడిసిముద్దవుతుంది. ఓ గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేం. కానీ మహారాష్ట్రలోని పుణె శివారులో ఉన్న పింప్రి చించ్‌వాడ్ (Pimpri-Chinchwad)లో బుధవారం ఏకధాటిగా ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత పునురుద్ధరించినప్టపికీ లోడ్ షెడ్డింగ్ (Load Shedding) సమస్య వెంటాడుతోంది. మరో మూడు రోజులు గడిస్తే ఈ సమస్య తీరేలా లేదు. మరి దీని మొత్తానికి కారణమేంటో తెలుసా.. ? ఒక చిన్న పిల్లి. దాని వల్లే పట్టణవాసులకు ఇంత కష్టమొచ్చింది.
ఒక పిల్లి వల్ల బుధవారం పింప్రి చించ్‌వాడ్‌లో ఆరు గంటలపాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మహాట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌పైకి పిల్లి ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. అనంతరం ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలోని 65,000 మంది వినియోగదారులపై ఈ ప్రభావం పడింది. శని, ఆదివారం వరకు విద్యుత్ ఇబ్బందులు తప్పడం లేదు.
అసలేం జరిగిందంటే..?
భోసారి వద్ద మహా ట్రాన్స్‌కోకి చెందిన ఓ హై ఓల్టేజీ 220 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. అక్కడ రెండు 100 MVA సామర్థ్యం, ఒక 75 MVA సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ఒక 100 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మూతపడింది. మిగిలిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లు MSEDCL పరిధిలోని మొత్తం 26 విద్యుత్ లైన్‌లకు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. అయితే బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. ఓ పిల్లి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. పిల్లి కూడా మరణించింది. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి.. 10 విద్యుత్ లైన్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 12 గంటల వరకు భోసారి, అకుర్దిలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులతో పాటు దాదాపు 60 వేల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎట్టకేలకు ఆరు గంటల పాటు శ్రమించి భోసారికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ ప్రస్తుతం ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌పైనే భారం మొత్తం పడుతోంది. అది కూడా 75 MVA సామర్థ్యం గలది. మరో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఉంటే తప్ప పరిస్థితి చక్కబడదు. అందువల్ల భోసరి ఎంఐడీసీ ఎస్ బ్లాక్, టీ బ్లాక్, భోసారి ఎంఐడీసీ ప్రాంగణంతో పాటు నెహ్రూనగర్, యశ్వంత్‌నగర్, శాంతినగర్, భోసారి గౌతమ్, ఇంద్రాయణి నగర్, చక్రపాణి వసాహత్, శాస్త్రి చౌక్‌లోని 7వేల మంది పారిశ్రామిక, వ్యాపార వినియోగదారులుకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కరెంట్ లేకపోవడం వల్ల రూ.100 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ సమస్యపై ఈ ప్రాంతంలోని కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్ బెల్ సారె మాట్లాడారు. తక్షణం విద్యుత్తు శాఖ మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మరో మూడు రోజులపాటు పునరుద్ధరణ అవకాశాలు కనిపించడం లేదని.. ఇలా అయితే తమకు భారీ నష్టాలు వస్తాయని వాపోయారు. మరోవైపు విద్యుత్తు పొదుపుగా వాడాలని, భారమంతా సింగిల్ ట్రాన్స్ ఫార్మరు పై పడుతోందని విద్యుత్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ రెండో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు శనివారం వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.