Passenger Trains Cancelled : ఎండలు భగభగ మండుతున్న వేళ కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా. అయితే మీకో బ్యాడ్ న్యూస్. టూర్ కు ప్లాన్ చేసుకునేముందు ట్రాన్స్ పోర్టుపై ముందే జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు పడయం ఖాయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా 11 వందల ప్యాసింజర్ రైళ్లు రద్దు కాబోతున్నాయి. రాబోయే 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా 11 వందలకు పైగా రైళ్లను రద్దు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దేశం ప్రస్తుతం కరెంట్ సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 1100 ప్రయాణికుల రైళ్ల ట్రిప్పులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 173 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 108 కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తున్నట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పలు రైల్వే జోన్లలో ప్రయాణికుల రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇలా రద్దు చేసిన ట్రిప్పుల్లో 500 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు కాగా, మరో 580 ప్రయాణికుల రైళ్లు ఉన్నాయి. ఈనెల 24వ తేదీ వరకు ఈ మొత్తం 11 వందల రైళ్లు నిలిచిపోనున్నాయి. రద్దైన రైళ్లకు అనుగుణంగా ప్రయాణాలు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు రైల్వే అధికారులు.
ALSO READ Shocking : భార్య ఫోన్ చూశాడు,అందులో అవి చూసి ఆమెను దారుణంగా చంపేశాడు
దేశవ్యాప్తంగా 70శాతం విద్యుత్ బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతోంది. ఇందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రైళ్ల ద్వారానే బొగ్గును తరలిస్తారు. ఈ క్రమంలో ప్రయాణికుల రైళ్ల రద్దీ దృష్ట్యా బొగ్గు తరలించే రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా బొగ్గు రవాణా చేసే రైళ్లకు ప్రాధాన్యం ఇస్తూ వేగంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2 40 ప్యాసింజర్ రైళ్లను ఏప్రిల్ 29న రద్దు చేసింది రైల్వే శాఖ. ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి.. నాలుగు వందల బొగ్గు రైళ్లను రన్ చేసింది. దేశంలో మరో నెల రోజుల పాటు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.