మీరు మీ డబ్బును సురక్షితమైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే పోస్టాఫీసు, ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు మీ కోసం రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deoposit) అనే ఓ అద్భుతమైన పథకాన్ని అందిస్తున్నాయి. ఈ పథకంలో మీరు ప్రతి నెలా జమ చేసే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ రెండూ సురక్షితంగానే ఉంటాయి. అయితే ఈ ఖాతా తెరిచే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రధానంగా డిపాజిట్ చేయడం ఆలస్యమైతే విధించే జరిమానాలు (Fine for Late Payments) ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా డిలే ఛార్జెస్ విధిస్తాయి. మరి ఆ ఆలస్య రుసుములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పోస్టాఫీసు ఆర్‌డీ పెనాల్టీస్
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఐదు సంవత్సరాల గడువుతో తెరవాలి కాబట్టి వరుసగా 60 నెలల పాటు డబ్బు జమ చేస్తూనే ఉండాలి. అయితే ఈ ఐదేళ్లలో ఏదో ఒక నెలలో డిపాజిట్ చేయలేకపోవడమో.. లేదా ఆలస్యంగా చెల్లించడమో చేస్తే అదనపు ఛార్జీలు పడతాయి. పోస్టాఫీసు నిబంధనల (Post Office Rules for RD) ప్రకారం.. అన్ని డిపాజిట్లు సకాలంలో చెల్లించాలి. ఆలస్యంగా చెల్లించినట్లైతే అది డిఫాల్ట్ లేదా డిలే డిపాజిట్ గా మారుతుంది. అప్పుడు మీరు డిఫాల్ట్ ఫీజుగా రూ. 100కి రూపాయి చెల్లించాలి. ఆ విధంగా ఒక నెలలో చెల్లించాల్సిన రూ. 5000ని సకాలంలో జమ చేయకపోతే .. 50 రూపాయలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు తదుపరి నెలలో రూ. 5050 + రూ. 5000 జమ చేయాల్సి ఉంటుంది.
ఖాతాదారులు గరిష్టంగా వరుసగా నాలుగు నెలలు వాయిదాలు కట్టకుండా ఉండొచ్చని నిబంధనలు తెలుపుతున్నాయి. ఒకవేళ ఐదవ వాయిదా కూడా చెల్లించకపోతే.. వారి అకౌంట్ డిస్‌కంటిన్యూడ్ ఖాతా(Discontinued account)గా మారుతుంది. అప్పుడు ఈ డిస్‌కంటిన్యూడ్ ఖాతాను రెండు నెలల వ్యవధిలో పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వరుసగా ఐదు వాయిదాలను చెల్లించకపోతే మీ ఖాతాను డిఫాల్ట్‌గా పరిగణించి, డీయాక్టివేట్ చేస్తామని ఇండియా పోస్ట్ నిబంధనలు పేర్కొన్నాయి. అయితే రెండు నెలలలోగా దీన్ని మీరు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ మీరు రెండు నెలల్లోగా చెల్లించాల్సిన మొత్తం, ఫైన్ తోపాటు నగదు జమ చేయకపోతే మీ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తారు. ఆ తర్వాత మీరు డిపాజిట్ చేసేందుకు కూడా వీలు ఉండదు.
సింపుల్ గా చెప్పాలంటే.. రూ.10,000 నెలవారీ వాయిదాలతో ఖాతా తెరిచిన వ్యక్తి.. ఐదు నెలల పాటు వాయిదాలు కట్టకపోతే.. ఆ వ్యక్తి రూ.50,000 సహా రూ.500 జరిమానాను ఒకేసారి చెల్లించి ఖాతా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ ఛార్జీలు కూడా పడే అవకాశం ఉంది.
ఎస్‌బీఐ ఫెనాల్టీ
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ 12 నెలల కనీస కాలపరిమితితో 120 నెలల గరిష్ట కాలపరిమితితో రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ఆఫర్ చేస్తోంది. మీరు ఎస్‌బీఐలో రూ.100తో ఆర్‌డీ ఖాతా తెరవవచ్చు. అయితే ఈ ఖాతా మెచూరిటీ సమయం కంటే ముందుగానే క్లోజ్ చేసినట్లయితే వడ్డీరేటు అనేది ముందస్తుగా నిర్ణయించిన దానికంటే తగ్గుతుంది. ఈ ఆర్‌డీలో ప్రతి నెలా డిపాజిట్లు జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే మెచూరిటీ ప్రాతిపదికన ఫైన్ పడుతుంది.
మెచూరిటీ వ్యవధి 5 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ గల ఖాతాలపై ప్రతి రూ.100కి రూ.1.50 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రస్తుత నెలకు చెల్లించాల్సిన రూ.1000ని నిర్ణీత వ్యవధిలోపు జమచేయకపోతే.. వచ్చే నెలలో రూ.1015 + రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
5 ఏళ్ల కంటే ఎక్కువ మెచూరిటీ వ్యవధి కలిగిన ఖాతాలపై ప్రతి రూ.100కి రూ. 2.00 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రస్తుత నెలలో కట్టాల్సిన రూ.1000 సకాలంలో జమచేయకపోతే.. వచ్చే నెలలో రూ.1020 + రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మూడు లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలను వరుసగా చెల్లించకపోయినా లేదా అకౌంట్ యాక్టివ్ గా ఉంచుకోకపోయినా.. రూ.10 సర్వీస్ ఛార్జీ చెల్లించాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫైన్స్ (Punjab National Bank)
ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6 నెలల కనీస కాలపరిమితితో ఆర్‌డీ పథకాన్ని అందిస్తోంది. మీరు ఒక నెల చొప్పున (7, 8, 9 నెలలు) ఆర్‌డీ ఖాతాను 120 నెలల వరకు ఓపెన్ చేయొచ్చు. మిస్సయిన డిపాజిట్లపై ప్రతి రూ.100కి రూ.1 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మిస్సయిన డిపాజిట్లను ఎప్పుడైతే చెల్లిస్తారో ఆ సమయం నుంచే ఆ డిపాజిట్లపై వడ్డీ లెక్క కడుతుందీ బ్యాంకు.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
ఒక నెల ప్రారంభం నుంచి చివరాఖరి వర్కింగ్ డే వరకు ఎప్పుడైనా మీరు మీ ఆర్‌డీ ఖాతాలో వాయిదా కట్టొచ్చు. నెలలో 31వ తేదీ వర్కింగ్ డే అయినట్లయితే ఆ రోజు కట్టినా.. ఎలాంటి ఆలస్య రుసుముతో వసూలు చేయదు బ్యాంక్ ఆఫ్ బరోడా. కానీ ఒక నెల మొత్తం లో ఎలాంటి డిపాజిట్ చేయని పక్షంలో రూ.100కి రూ.1 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఖాతాను ముందుగానే క్లోజ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగా నిర్ణయించిన దాని కంటే 1 శాతం తక్కువ వడ్డీతో డబ్బులు చెల్లిస్తుంది.
కెనరా బ్యాంక్ (Canara Bank)
కెనరా బ్యాంకులో కనీసం రూ.50తో 6 నెలల కాలపరిమితితో ఆర్‌డీ ఖాతా తెరవవచ్చు. ఐదేళ్లు, అంతకన్నా తక్కువ కాలపరిమితి గల ఖాతాలో ఆలస్యంగా చెల్లించిన ప్రతి డిపాజిట్ పై ప్రతి రూ.100కి రూ.1.50 చెల్లించాలి. ఐదేళ్లు మించిన ఖాతాల విషయంలో ప్రతి రూ.100కి రూ.2 చెల్లించాల్సి ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
ఐసీఐసీఐ బ్యాంక్ iWish అనే ఒక అదిరిపోయే రికరింగ్ డిపాజిట్ ప్రొడక్ట్ ని ఆఫర్ చేస్తోంది. ఇది ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. ఇది మిస్సయిన డిపాజిట్లపై పైసా కూడా వసూలు చేయదు. దీని కనీస డిపాజిట్ రూ.500.. కనీస కాల పరిమితి 6 నెలలు. ఇది అన్ని ఇతర ఆర్థిక సంస్థలకు దీటుగా వడ్డీ రేటును అందించడం గమనార్హం. 'మిస్డ్ నెలవారీ వాయిదాలపై జరిమానాలు లేవు కొన్నిసార్లు, జీవితం చాలా బిజీగా మారొచ్చు. వాయిదాలు కట్టడం మిస్ కావచ్చు. కానీ మీరు iWishతో, మీ ఆర్‌డీ వాయిదాల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే మేం ఎటువంటి పెనాల్టీను విధించం' అని ఐసీఐసీఐ పేర్కొంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)
నిర్దిష్ట తేదీ దాటి గ్రేస్ పిరియడ్(5 రోజులు) తర్వాత కూడా నెలవారీ వాయిదా చెల్లించకపోతే.. ఆర్‌డీపై వచ్చే వార్షిక వడ్డీపై 2% జరిమానా కట్టాల్సి ఉంటుంది. లేదా ఆలస్యమైన నెలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొన్నట్లుగా పెనాల్టీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేటును లెక్కించడానికి మిస్సైన ఒక డిపాజిట్ ని పూర్తి నెలగా పరిగణిస్తారు.
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
యాక్సిస్ బ్యాంక్‌లో ప్రతి డిఫాల్ట్/లేట్ రికరింగ్ డిపాజిట్ వాయిదాపై ప్రతి రూ.1000కి రూ.10 చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ లో మినిమం డిపాజిట్ అమౌంట్ రూ.500, మినిమం కాలపరిమితి ఆరు నెలలు.
ఇండియన్ బ్యాంక్ (Indian Bank)
ఇండియన్ బ్యాంక్ ఆర్‌డీల్లో ఆలస్యమైన ప్రతి డిపాజిట్ పై ప్రతి రూ.100కి రూ.1.70 పెనాల్టీ చెల్లించాలి. మీ లేట్ డిపాజిట్లు, అడ్వాన్స్ డ్ డిపాజిట్లు మెచూరిటీ కాలంలోపు సమానంగా ఉన్నట్లయితే.. ఆలస్య రుసుము రద్దు అవుతుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India)
5 ఏళ్ల లోపు కాలపరిమితి ఖాతా విషయానికొస్తే.. ఆలస్యమైన మిస్సయిన ప్రతి డిపాజిట్ పై ప్రతి రూ.100కి రూ.1.50 పెనాల్టీ చెల్లించాలి. 5 ఏళ్ల కంటే మించిన కాలపరిమితి ఖాతా విషయానికొస్తే.. మిస్సయిన ప్రతి డిపాజిట్ పై ప్రతి రూ.100కి రూ.2.00 పెనాల్టీ చెల్లించాలి.
యూనియన్ బ్యాంకు (Union Bank) లో డిలే డిపాజిట్లపై ఎలాంటి ఆలస్యం చెల్లించాల్సిన అవసరం లేదు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.