నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుమారు 100 పేజీల ఫిర్యాదు ప్రతిని వారు సాక్ష్యాలతో సహా అందించారు. పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు ఎప్పుడెప్పుడు, ఎలాంటి కామెంట్స్ చేశారు? టీవీల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల వీడియోలు, పేపర్ క్లిపింగ్స్ కూడా ఆ 100 పేజీల ఫిర్యాదులో ఉన్నాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిధున్ రెడ్డి, ఎంపీలు మార్గాని భరత్, బాలశౌరి, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఈ రోజు ఢిల్లీకి వెళ్లి రఘురామకృష్ణంరాజు మీద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అనర్హత వేటు వేయాలని కోరారు. లోక్ సభ స్పీకర్‌ను కలిసిన అనంతరం వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణంరాజు.. జగన్ మీద అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఉంటూ మిగిలిన ప్రతిపక్షాలతో మంతనాలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఫైల్ చేశామన్నారు.
‘రఘురామకృష్ణంరాజు నైతిక విలువలు కోల్పోయారు. ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారు. ఆయన దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం. కొన్ని ఊహాజనిత విషయాలను ఊహించుకుంటున్నారు. ఏదైనా ఒక విషయం మీద క్లారిటీ రావాలంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. బయటకు రాకూడదు. ఏదైనా అసంతృప్తి, విషయం ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. అంతేకాని రోడ్డుక్కకూడదు. ఒక ఉద్దేశంతో ఆయన ఇదంతా చేశారు.’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
రఘురామకృష్ణంరాజు రాజకీయ, వ్యక్తిగత ప్రవర్తన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన, అనర్హత కిందకు వస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు. రఘురామకృష్ణం రాజు భౌతికంగా పార్టీలో ఉన్నా, మనస్ఫూర్తిగా వైసీపీలో లేరని చెప్పారు. రఘురామకృష్ణం రాజు మనసు, బుద్ధి పార్టీలో లేదు కాబట్టే ఈ అనర్హత వేటు నిర్ణయం తీసుకున్నామన్నారు.
రఘురామకృష్ణంరాజుకు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేశారు. తాను జగన్ ఫొటోతో గెలవలేదని, ఎమ్మెల్యేలు తన ఫొటో పెట్టుకుని గెలిచారని చెప్పిన రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు పడేకంటే ముందే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని నందిగం సురేష్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju, Raghuramakrishnam raju, Vijayasai reddy