ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు రద్దు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి ఊరటనివ్వగా.. ఎన్నికల సంఘానికి మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు సూచనలను పాటించకుండా.. కోర్టు ఆదేశాలను గౌరవించాలని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
'' డియర్ ఎస్ఈసీ. హైకోర్టు ఆదేశాలను గౌరవించండి. చంద్రబాబు సూచనలను పాటించకండి. చంద్రబాబు నాయుడుకు నిమ్మగడ్డ విశ్వసనీయుడు అని మనందరికి తెలుసు. కానీ ఇప్పుడు నైతికతను పరీక్షించుకునే సమయం వచ్చింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నైతికత ఆధారంగా అతడు తప్పుకుంటాడా? లేదంటే అతడి నుంచి మనం ఎక్కువ ఆశిస్తున్నామా? అనేది చూడాలి.'' అని ట్విటర్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని.. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, కోవిడ్ వ్యాక్సినేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ఈ మేరకు తీర్పును వెల్లడించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 8న షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరి 23న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 31న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 5న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 9 న రెండోదశ, ఫిబ్రవరి 13 న మూడోదశ, ఫిబ్రవరి 17 న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య యుద్ధం నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nimmagadda Ramesh Kumar, Vijayasai reddy, Ysrcp