టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన స్టయిల్లో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారని... నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసించడంతో పాటు పరామర్శిస్తారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఓ పాతికసార్లు ప్రాధేయ పడితే ప్రధాని మోదీ కాల్ చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని మోదీపై చంద్రబాబు ఏ స్థాయిలో విమర్శలు గుప్పించారో విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు. ఆయన వినమ్రత అది. పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 15, 2020
మోదీ ఏం మొహం పెట్టుకుని ఏపీకి వస్తాడన్న చంద్రబాబు... మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీ మర్చిపోయుంటాడని అనుకుంటున్నాడని... కానీ మోదీది అపార జ్ఞాపకశక్తి ఉందని వ్యాఖ్యానించారు. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరని చంద్రబాబుపై మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని చంద్రబాబు అప్పట్లో డప్పుకొట్టుకున్నాడని.. క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 3 జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని ఎప్పుడో లేఖ రాశాడట అంటూ సెటైర్లు వేశారు. ఉదయం ఫోన్ వస్తే 4 గంటలు ఓపిక పట్టలేనోడు, లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Pm modi, Vijayasai reddy