టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా ? అని ప్రశ్నించారు. మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరని వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. సీఎం జగన్ వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కృష్ణానదికి వరదొస్తే కరకట్ట కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని ఆరోపించారు.
కరోనా వైరస్ ప్రబలుతుందనగానే పెట్టేబేడా సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడని ఎద్దేవా చేశారు. మూడడుగుల దూరం పాటించమంటే మూడొందల కిలోమీటర్లు పారిపోయిన నువ్వు సుద్దులు చెప్పటమేంటీ బాబూ ? కర్మ కాకపోతే అంటూ తనదైన స్టయిల్లో చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్సులో సీఎం జగన్ మాట్లాడింది విన్న తర్వాత రాష్ట్ర సన్నద్ధత గురించి ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా బాబూ ? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయొద్దని చోడవరంలో చనిపోయిన వృద్ధురాలి బంధువులు గడ్డి పెట్టారుగా అని వ్యాఖ్యానించారు. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండని తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారు. సిఎం జగన్ గారు వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 3, 2020
చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో అత్యవసర వైద్య సదుపాయాలు పెంచింది లేదన్న విజయసాయిరెడ్డి... వెంటిలేటర్లు, కొత్త ఐసీయూల ఏర్పాటుకు రూపాయి ఖర్చు పెట్టలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇపుడు కరోనాలాంటి వ్యాధులు వస్తాయని తనకు ముందే తెలుసుని కథలు చెబుతున్నాడని... బాబు అధికారంలో ఉండగా 108, 104 అంబులెన్సుల్ని మూలన పడేసి ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టి వెళ్లిపోయాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Coronavirus, Covid-19, Tdp, Vijayasai reddy, Ysrcp