హోమ్ /వార్తలు /national /

సీఎం చెప్పినా అంతే... మళ్లీ నిరసన గళం వినిపించిన వైసీపీ ఎమ్మెల్యే...

సీఎం చెప్పినా అంతే... మళ్లీ నిరసన గళం వినిపించిన వైసీపీ ఎమ్మెల్యే...

ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్ జగన్

ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్ జగన్

వరుసగా రెండో రోజు వైసీపీ ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి నిరసన గళం వినిపించారు. అధికారుల తీరుపై మరోసారి ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో నీటి లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయన్న ఆనం... సోమశిల స్వర్ణముఖి కెనాల్ పరిశీలించాలని సీఎం చెప్పినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని మండిపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు. ఏ అధికారి సరిగా సమాదానం చెప్పడం లేదని... మరో మూడు రోజుల్లో పూర్తి సమాచారంతో మీడియా సమావేశం పెడతానని ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిన్న కూడా ఆనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని... గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని ఆయన తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు మంత్రిగా పని చేశానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారేమో అని ఆనం అన్నారు. తాను ఎంతో ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ప్రజల కోసం ఎవరినైనా నిలదీస్తానని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్ప... మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆనం తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని చూడలేదని అన్నారు. జలవనరులశాఖలో అధికారులే నీళ్లు అమ్ముకున్నారంటూ విమర్శలు చేశారు. మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్‌లు ఇస్తే... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుసగా రెండో రోజు ఆనం ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో... అసలు ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే అంశం వైసీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

First published:

Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy