విశాఖ కంటకుడు చంద్రబాబు అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి విరుచుకపడ్డారు. విపక్షంలో చేసేదిలేక చంద్రబాబు విశాఖ అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలా? అని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రాసిన ఓ వ్యాసంలో చంద్రబాబుపై విజయసాయి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గ్రాఫిక్స్‌తో మాయలు చేసి, రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చంద్రబాబు ప్రకటించుకున్నారని..అయితే సదస్సులు పెట్టడానికైన ఖర్చులో సగం పెట్టుబడులు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. సదస్సులో పెట్టిన శనగపప్పు, జీడిపప్పు ఖర్చులంటూ వందల కోట్లు కొల్లగొట్టిన చరిత్ర 40 ఇయర్స్ ఇండస్ట్రీదంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రం సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ భూములపై కన్నేసినట్లే...తర్వాత అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిలో కొంత విశాఖకు చెందాలంటే..కుదరదంటే కుదరని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు.
14 ఏళ్ల చంద్రబాబు పాలనలో విశాఖ తీవ్ర అన్యాయానికి గురైయ్యిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు వర్సిటీల కోసం ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను చంద్రబాబు మసకబార్చారని..దాదాపుగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఏపీలో తొలి యూనివర్సిటీగా ఖ్యాతిచెందిన ఏయూను అన్ని విధాలా భ్రష్టుపట్టించేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అని చెప్పుకోవడం తప్ప...ఆ ప్రాంతం కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాగితాలకు, ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలకు మాత్రమే పరిమితం చేశాడని ఆరోపించారు.
విశాఖకు ఐటీ కారిడార్ అవసరమని భావించి...అక్కడకు ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ధివంగత వైఎస్సార్‌కు చెందుతుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ మరణానంతరం విశాఖకు మెట్రో రైలు కలను చంద్రబాబు చిదిమేశారని ధ్వజమెత్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరంకాకుండా అడ్డుకున్న ఘనత వైఎస్సార్‌కు చెందుతుందన్నారు. అధికారంలో ఉన్నా...లేకున్నా.. విభిన్న సంస్కృతులతో మినీ భారత్‌ను తలపించే వైజాగ్ అభివృద్ధి కోసం తపించే నాయకుడు సీఎం జగన్‌గా పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp