చంద్రబాబు పాలనలో ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైఎస్ జగన్ ఆరోపించారు. ఒకే కులానికి చెందిన పోలీసులకే పదోన్నతులు ఇచ్చారని..ఆ డీఎస్పీలు చంద్రబాబుకు తొత్తులుగా మారరానని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిసిన జగన్.. పోలింగ్ తర్వాత ఏపీలో పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్‌ని టీడీపీ నేతలు యథేచ్చగా తెరుస్తున్నారని.. కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై చంద్రబాబునాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు జగన్. 2014 ఇవే ఈవీఎంలతో చంద్రబాబు గెలిచారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు వైసీపీ అధినేత.
నిన్న ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశాం. అవే అంశాల మీద ఇక్కడ గవర్నర్‌ను కలిశాం. ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ దాడులు చేసింది. చంద్రబాబునాయుడు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ శాఖల్లోని తమ మనుషులను ఉపయోగించుకుంటూ దొంగ కేసులు పెడుతున్నారు.
— వైఎస్ జగన్
కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం నేరం. లోపలికి వెళ్లి గది తాళం వేసుకున్నారు. తనంతట తానే చొక్కాలు చింపుకున్నారు. అంతచేస్తుంటే పోలింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు. ఎందకు ఆయనపై చర్య పెట్టలేదు. బూత్‌లోకి చొరబడి తాళం వేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు. గురజాలలో ఎస్సీలు, మైనార్టీలపై దాడులు చేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే శ్రీవాణిపై దాడి జరిగింది. పూతలపట్టులో వైసీపీ అభ్యర్థిపై దాడిచేశారు. చంద్రబాబు ఒక కులంవారికే పోలీస్ ప్రమోషన్స్ ఇచ్చారు. ఆ డీఎస్సీలు చంద్రబాబుకు తొత్తుగా మారారు.
— వైఎస్ జగన్
గవర్నర్‌ను కలిసిన జగన్
యథేచ్ఛగా స్ట్రాంగ్ రూమ్స్ తెరుస్తున్నారు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. అభ్యర్థులు లేకుండా ఎలా తెరుస్తారు. స్ట్రాంగ్ రూమ్స్‌ని కేంద్రబలగాలు ఆధీనంలోకి తీసుకోవాలి. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఈవీఎం భద్రతను పెంచాలి. సినిమాలో విలన్ పాత్రను చంద్రబాబు పోషిస్తున్నారు. ఈవీఎంలపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. తన ఓటు ఎవరికి పడిందో తెలియదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓటువేసిన ప్రతి ఒక్కరు సంతృప్తిగానే ఉన్నారు.
— వైఎస్ జగన్
ఓటమి భయంతోనే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను గెలిస్తే అన్ని బావుంటాయని..కానీ ఓడిపోయే పరిస్థితుంటే ఈవీఎంపై నిందులు వస్తారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన భరించలేకే ప్రజలు బై..బై చెప్పారని ఎద్దేవా చేశారు వైసీపీ చీఫ్.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.