కడప జిల్లా టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య ఘటన రాజకీయ ప్రకంపనలు రేగుతోంది. అధికార వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయన ఆలయంలో ప్రమాణం చేశారు. ప్రొద్దుటూరులోని ప్రముఖ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయానికి వెళ్లిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. సుబ్బయ్య హత్యతో తనకు సంబంధం లేదంటూ అమ్మవారి పాదాలపై సత్యప్రమాణం చేశారు. తాను తప్పు చేస్తే అమ్మవారే తనను శిక్షిస్తుందన్నారు. హత్య గురించి ముందే తెలిసుంటే సుబ్బయ్యను రక్షించి ఉండేవాడినన్నారు. హత్య కేసు విషయంలో ఎలాంటివిచారణకైనా సిద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవసరమైతే తల్లిదండ్రులపైనా ప్రమాణం చేస్తానని ఆయన తెలిపారు. నందం సుబ్బయ్య ను చంపాలని చేతితో సైగ చేయలేదని., నోటితో చెప్పలేదని.., కంటితో శాసించలేదని స్పష్టం చేశారు.
ఐతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సత్య ప్రమాణంపై మృతుడు నందం సుబ్బయ్య భార్య అపరాజిత స్పందించారు. హత్య చేసిన వాడు ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని ఆమె ఆరోపించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రమాణాలైనా చేస్తాడని ఆమె అన్నారు. గతంలో నందం సుబ్బయ్య రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అనుచరుడిగా పనిచేశాడని.. అప్పట్లో ఆయన చేసిన తప్పులు, అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలు తన భర్తకు తెలుసని అపరాజిత చెప్పారు. అంతేకాదు తన అక్రమాలు బయటపెడాతాడన్న భయంతోనే హత్య చేశారని ఆరోపించారు. తన భర్తపై క్రిమినల్ కేసులున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని.. కానీ 14 కేసులు అక్రమమని కోర్టులో కొట్టేశాయని ఆమె తెలిపారు. తన భర్తకు పార్టీ విషయాలు తప్ప మరో లోకం లేదని.., అలాంటి వాడికి మహిళలతో సంబంధాలున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి, మున్సిపల్ కమిషనర్ అనురాధకు సంబంధం ఉందన్నారామె. పోస్ట్ మార్టం రిపోర్ట్ తమ దగ్గరకు రాకుండానే... రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎలా చేరిందని ఆమె ప్రశ్నించారు. కుండారవే హత్య చేసినట్లు ముందుగానే ఎమ్మెల్యేలకు ఎలా తెలుసన్నారామె.
మరోవైపు నందం సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపణలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. సుబ్బయ్యకు చాలా మంది మహిళలతో సంబంధాలున్నాయన్నారు. ఆరేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారయత్నం చేయడంతో ఆమె అన్న కుండా రవి అతడ్ని హత్య చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ-1గా కుండా రవి ఉన్నారు. ప్రొద్దుటూరులో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన స్థలంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిథి నందం సుబ్బయ్యను హత్య చేశారు. ఐతే అదే సమయంలో మున్సిపల్ కమిషనర్ అనురాధ అక్కడే ఉండటంతో ఆమెకు ఈ హత్యతో సంబంధమున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఐతే హత్య జరిగే సమయంలో తాను హోమంలో ఉన్నాని.., తనకేం తెలియదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ పేరును కూడా చేర్చాలని ఆందోళనకు దిగారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించిన లోకేష్.. సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరగకుంటే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.