ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మెజార్టీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ లు సొంతం చేసుకుంటామని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అన్ని ప్రాంతాల్లో సగానికి పైగా వార్డులు, డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్నారు అధికార పార్టీ నేతలు.
అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన నగరి ఎమ్మెల్యే రోజా పరిధిలోని రెండు మునిసిపాలిటీలో మాత్రం ఏకగ్రీవాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం రెండు మున్సిపాలిటీల్లో ఏక గ్రీవానికి రోజా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరి మున్సిపాలిటీలో 29 వార్డులకు 7 మాత్రమే రోజా ఏకగ్రీవం చేసుకోగలిగారు. మిగిలిన అన్ని వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ అయినా పుత్తూరులోని 27 వార్డులలో 1 మాత్రమే ఏకగ్రీవం కాగా...మరో 26 వార్డులకు ఎన్నికలు జారుతున్నాయి.
అయితే స్వపక్షంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, కొందరు నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల రోజే ఆ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అదే విషయాన్ని స్వయంగా పోలింగ్ రోజే రోజా బహిర్గతంగా మాట్లాడడం అధిష్టానాన్ని షాక్ కు గురి చేసింది.
నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న రోజా సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారే మరోసారి ఇప్పుడు ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో 14 మంది రెబల్స్ ను బరిలోకి దింపి.. ప్రతిపక్ష పార్టీ గెలుపునకు సహకరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రెబెల్స్ ను భారీగా గెలిపించేందుకు భారీగా డబ్బులు కూడా ఖర్చు చేశారని ఆరోపించారు. పార్టీలో ఉన్న కొందరు పెద్దలు.. రెబెల్ నాయకులకు సపోర్ట్ చేస్తూ వారేదో దేశ సేవకులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తల్లి పాలు తాగి రొమ్మును తన్నే విధంగా కొందరు నాయకులు ప్రవర్తించడం దారుణమన్నారు. వైసీపీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం ఇష్టం లేనివారే ఇదంతా చేస్తున్నారని.. ఇప్పటికే దీనిపై అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదు చేశాను అన్నారు. ఇప్పటికైనా అదిష్టానం చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక పార్టీలో వర్గ పోరు అన్నది సర్వ సాధరాణం. అన్ని పార్టీలకు ఈ తలనొప్పులు తప్పవు. అయితే మున్సిపల్ ఎన్నికల రోజు రోజా ఇలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. నగరిలో ఏదో జరుగుతోందనే భయం ఆమెను వెంటాడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రోజా మాత్రం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. వైసీపీ అభ్యర్థులను గెలిపించి తీరుతాను అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap local body elections, MLA Roja, Nagari, Roja