తిరుపతి ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి హీటెక్కింది. వైఎస్ వివేక హత్య పై తిరుమల వెంకన్న స్వామిపై ప్రమాణం చేస్తారా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇప్పటికే సవాల్ విసిరారు. వెంకన్న స్వామిపై ప్రమాణం చేసి తమ కుటుంబానికి హత్యతో సంబంధం లేదని చెబుతామని.. మరి సీఎం జగన్ ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతున్నారు. ఈ సవాల్ కు భయపడే కరోనా సాకు చూపించి సీఎం జగన్ ప్రచారానికి కూడా రాలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీ నేతలకు కౌంటర్ గా.. టీడీపీ ఎంపీలకు సవాల్ విసిరారు ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి. తిరుపతి ఎంపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే.. తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని.. టీడీపీ ఓడి పోతే ఆ ఒక్కపని చేస్తారా అంటూ పెద్దిరెడ్డి ప్రతి సవాల్ విశారు. మరి ఈ సవాల్ ను టీడీపీ నేతలు స్వీకరిస్తారో లేదో చూడాలి.
ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఓ వైపు ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థులు బిజీ. బిజీగా ప్రచారాలు చేస్తుంటే.. అధికార, విపక్షాల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి.. వైసీపీ పావులు కదుపుతుంటే, అధికార పార్టీ ఓడించాలనే సంకల్పంతో విపక్షాలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా ఇతర కీలక నేతలంతా గెలుపే ధ్యేయంగా తిరుపతిలోనే మకాం వేశారు. ఈ ఉప ఎన్నికలో గెలుపొంది వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొదటి వైసీపీ నేతలు సైతం భారీగా మెజార్టీ వస్తుందని లెక్కలు వేశారు. కానీ పరిస్థితి అంతా ఈజీగా కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది వైసీపీ ఇంటర్నల్ సర్వేలో కూడా ఊహించినంత మెజార్టీ రావడం లేదని అంచనావకు వచ్చినట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నిక కేక్ వాక్ కాదని వైసీపీ నేతలు నిర్ధారణకు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అందుకే మొన్నటి వరకు మెజార్టీపైనే లెక్కలు వేసుకుంటూ ధీమాగా ఉన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు మాటల దాడిని పెంచారు. అందుకే నేరుగా టీడీపీకి సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.
ప్రస్తుతం తిరుపతిలోనే కాదు ఏపీ ప్రజలంతా సీఎం జగన్ వైపే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. ప్రజా సంక్షేమ పధకాలు.. ప్రజలకు ప్రభుత్వం చేసిన సేవే తమ అభ్యర్థిని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం సభ రద్దు అయిందన్నారు. ప్రజలు కరోనా భారిన పడకుండా.. ఉండేందుకే సీఎం పర్యటన రద్దయిందని, ప్రజల మేలు గురించే సీఎం జగన్ ఎప్పుడు పరితపిస్తుంటారని ఆయన గుర్తు చేశారు. ఈ తిరుపతి ఉప ఎన్నికను తమ పార్టీ రెఫరెండంగా తీసుకుంటుందన్నారు. మరి విపక్షాలు అందుకు సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పెద్దిరెడ్డి.. సునీల్ థియోధర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. జాతీయ నాయకుడు అయన.. తమ పార్టీ అభ్యర్థి గురు మూర్తి మతంపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఓ దళిత వ్యక్తిపై ఇలాంటి దారుమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
ఈ తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్థి గురు మూర్తి ఓటమిపాలైతే.. 21 మంది ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. అదే వైసీపీ గెలిస్తే టీడీపీ ఎంపీలతో సహా.. వారికి సహకరిస్తున్న నర్సాపురం రఘురామా కృష్ణం రాజుతో ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సవాల్ విసిరారు. గతంలో పాచిపోయిన లడ్డులే ఇప్పుడు పవన్ కు తాజాగా కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. టీడీపీ బీజేపీతో లోపాయకారి ఒప్పదం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Peddireddy Ramachandra Reddy, TDP, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp