ఇది నామాట.. నా మాటే శాసనం. అధికారంలోకి వచ్చిన ఏపార్టీ అయినా అదే చెప్తుంది. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అస్సలు రాజీపడవు. రాష్ట్రంలో రెండు అంశాల విషయంలో వైసీపీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడతానంటోంది. ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాల్లో ఒకటి విశాఖ కార్యనిర్వహక రాజధాని, రెండోది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం. ఈ విషయంలో ప్రభుత్వం అనుకున్నది సాధించి తీరుతుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. ఈ విషయంలో సెకండ్ థాట్ లేదని క్లారిటీ ఇచ్చారు.
మేం అనుకున్నట్లే చేస్తాం..
స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వానికి ఎస్ఈసీకి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే అంతా జరగాలని బలంగా ఫిక్సైంది. ఈ నేపథ్యంలో కోర్టు కేసులను కూడా ఎదుర్కొంది. అయినా సరే తాము అనుకున్నది చేసి తీరుతామని ధీమాగా చెప్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల అంశం కోర్టు పరిదిలో ఉందంని.. అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కోర్టుల్లో సమస్యలు క్లియర్ అయిన వెంటనే ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తామన్నారు. ఎవరెన్ని రాజకీయాలు, కుట్రలు చేసినా అంతిమ విజయం ప్రభుత్వానిదేనని చెప్పారు.
రాజధాని అక్కడే..
మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయం అమలు జరిగి తీరుతుందని విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో ఆలోచనకు అవకాశమే లేదని పేర్కొన్నారు. ఎవరికి చెప్పాలో వారికే చెప్పిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిచామన్న విజయసాయి త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని.. దీంట్లోనూ కూడా ఎలాంటి మార్పు లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు.
అవన్నీ నాటకాలే..!
మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్షాలు ఎన్నినాటకాలు ఆడినా ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన రెఫరెండం సవాల్ కు కౌంటర్లు వేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ నేతలతో రాజీనామా చేయించి గెలవాలంటున్నారు. కేసీఆర్, వైఎస్ జగన్ తాము నమ్మినదాని కోసం రాజీనామాలు చేసి, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించారని.., చంద్రబాబు కూడా వైఎస్ జగన్ మాదిరిగానే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలపై వైఎస్ జగన్‌కి ఉన్న దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదంటున్నారు. అమరావతిలో తన భూములు ధరలు తగ్గిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో చంద్రబాబు అజెండానే ఎస్ఈసీ అమలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Ap capital, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, Chandrababu naidu, Vijayasai reddy, Visakhapatnam, Vizag, Ysrcp