ప్రధాని నరేంద్ర మోదీ మీద రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ పాల్గొంటున్న బహిరంగ సభల్లో ప్రజలు ‘బైబై మోదీ’ అంటున్నారని చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడం ద్వారా స్వయంగా బీజేపీ ప్రభుత్వమే అప్రతిష్టను మూటగట్టుకుందని అజిత్ సింగ్ అన్నారు. యూపీలోని షుగర్ మిల్లుల యాజమాన్యాలు రైతులకు బకాయిలు చెల్లించడం లేదని, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఎన్నో వైఫల్యాలు ఉంటే, మొత్తం ఐదేళ్లలోనే అంతా జరిగిందన్నట్టుగా మోదీ ప్రచారం చేస్తుంటారని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు. ‘ఆయన (మోదీ) ఎంత తెలివైన వ్యక్తి అంటే, ఒకవేళ శ్రీలంక వెళ్లారనుకో. వచ్చిన తర్వాత రావణుడిని కూడా తానే చంపానని చెప్తారు. దేశంలో ఇంకెవరూ ఏమీ చేయలేదని చెబుతారు.’ అని అజిత్ సింగ్ కామెంట్ చేసినట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఉన్న బాగ్‌పట్ లోక్‌సభ నియోజకవర్గంలో అజిత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఇక్కడ తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద కూడా అజిత్ సింగ్ విమర్శలు గుప్పించారు. 2018 మార్చి 31 వరకు చెరకు రైతులకు బకాయిలు ఇప్పిస్తామని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ మాట తప్పారని చెప్పారు. బకాయిలు చెల్లించకపోతే మిల్లుల యజమానులను జైల్లో వేస్తానని చెప్పారని, అటు బకాయిలు రాలేదు. వారిని జైల్లోనూ వెయ్యలేదని అజిత్ సింగ్ ఆరోపించారు. యూపీలో ఉన్న మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కలసి పోటీ చేస్తున్నాయి. ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ మూడు చోట్ల పోటీ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Mahakutami, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019