తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ జన సమితి సీపీఐ జట్లుగా ఏర్పడి ప్రజాకూటమిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 88 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజాకూటమిలోని కాంగ్రెస్ 16 సీట్లు... టీడీపీ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఇక కూటమిలోని తెలంగాణ జనసమితి సీపీఐ పార్టీలు కనీసం ఖాతా కూడా తెరవలేదు.
మరో నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఉంటుందా ? లేదా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కూటమి నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. కోదండరాం ప్రజాకూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీపై దాదాపు తప్పుకుంటారనే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి కారణాలు తయారుచేసి ఆ నివేదికను హైకమాండ్‌కు కాంగ్రెస్ పెద్దలకు కూడా పంపించారు. టీడీపీతో పొత్తు కూటమిని కొంత ఇబ్బంది పాలు చేసినా వేరే కారణాలు కూడా ఎక్కువ ప్రభావితం చేశాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అభిప్రాయం. అందుకే లోక్ సభ ఎన్నికల్లో కూటమిని కొనసాగించినా తప్పులేదని అభిప్రాయం పీసీసీ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ప్రజాకూటమి ఓటమిపై కోదండరాం స్పందిస్తూ అభ్యర్థుల్ని త్వరగా ఎంపిక చేయకపోవడం ప్రచారానికి సమయం లేకపోవడం కారణమని విశ్లేషించారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా తాము సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయామని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లు ఇక ముందు జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తు విషయంలో సానుకూలంగానే ఉన్నారు. కావున ప్రజాకూటమిలో టీడీపీ కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక శక్తుల్ని కలుపుకొని లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొవాలని చూస్తుంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్సీపీతో సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది.
ఇక తెలంగాణలో ఉన్న కూటమిని కాదనుకునే విధంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రజాకూటమి ఆలోచనతో వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కానీ కోదండరాం మాత్రం కాంగ్రెస్ కూటమితో కలిసివెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వరకు ప్రజాకూటమిలో ఏదైనా మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా? లేక విడిగా పోటీ చేస్తాయనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahakutami, Telangana, Telangana Jana Samithi, Telangana News, TS Congress, TTDP