బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేశాయి. పశ్చిమ్ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఐక్యతా ర్యాలీలో దాదాపు 20 పార్టీల నేతలు హాజరై.. తమ మద్దతు తెలిపారు. బీజేపీపై విమర్శలు వర్షం కురిపించారు. ఈ మీటింగ్‌తో బీజేపీయేతర పక్షాలన్నీ కూటమిగా ఏర్పడడం ఖాయమైపోయినట్టు స్పష్టమవుతోంది.అయితే, ఈ విపక్షాల కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయమై ఇప్పుడు కొత్త సందిగ్ధం ఏర్పడింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల కూటమి కొనసాగుతుందనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం పరిణామాలు వేరే సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నట్టు కనబడుతోంది. విపక్షాల మహాగట్‌బంధన్‌కు మమతా బెనర్జీ నాయకత్వం వహించే అవకాశం లేకపోలేదనే వాదన వినబడుతోంది.
తాజాగా, బీజేపీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించిన తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ... 20 ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో గ్రాండ్ సక్సెస్సయ్యారు. అంతేకాదు, లక్షల సంఖ్యలో తృణముల్ కార్యకర్తలు తరలిరావడంతో.. సభ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో సక్సెస్ కావడం దీదీకి.. మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో విపక్షాల ఐక్యతా ర్యాలీ విజయవంతం అయ్యింది. ఈ మీటింగ్‌లో అన్నీ తానై వ్యవహరించిన దీదీ.. వన్‌మ్యాన్ షో నిర్వహించారు. ఒకరకంగా చెప్పాలంటే.. కూటమికి పెద్దక్క పాత్ర పోషించారని చెప్పొచ్చు.
ర్యాలీలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ అధినేత దేవేగౌడ, ఆప్ అధినేత కేజ్రీవాల్ తదితరులంతా మమతను ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో, బీజేపీయేతర కూటమికి ఆమే నాయకత్వం వహిస్తారా అనే ప్రచారం జోరందుకుంది. ఆమె లక్ష్యం కూడా మోదీని ఢీకొట్టడమే అయ్యుంటుందని, అందుకే విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి తానేంటో నిరూపించుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినబడుతోంది.
మొదట్నుంచీ రాహుల్ నాయకత్వాన్ని అంతగా సమర్థించని దీదీ.. సరైన సమయంలో తన బలమేంటో చూపెట్టారన్న భావన వ్యక్తమవుతోంది. దీదీ చేపట్టిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలతో ఎదురైన అనుభవం నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి బలపడాలంటే దీదీకి నాయకత్వంలో ముందుకు సాగేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉండాల్సి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా నిర్వహించిన భారీ బీజేపీ వ్యతిరేక ర్యాలీతో.. తానేంటో నిరూపించుకున్నారు మమతా బెనర్జీ. రాహుల్ గాంధీ, కేసీఆర్, చంద్రబాబు లాంటి నేతలు ఫ్రంట్‌ల ఏర్పాటు కోసం ఇంకా చర్చల దశలోనే ఉండగా.. మమతా బెనర్జీ మాత్రం ఏకంగా బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు. దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపై ఆశీసులను చేశారు. దీంతో మోదీకి సరైన ప్రత్యర్థి తానేనని చెప్పకనే చెప్పినట్టైంది.
ఈ లెక్కన విపక్షాల కూటమి రాహుల్ నాయకత్వంలో కొనసాగుతుందా? మమత బాటలో నడుస్తుందా? అనే కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు, విపక్షాల తరపున రాహుల్ గాంధీతో పాటు మమత కూడా ప్రధానిరేసులో ఉంటుందనడంలో సందేహం లేదని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.
ఇది కూడా చూడండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arvind Kejriwal, Chandrababu Naidu, CM KCR, Kumaraswamy, Mahakutami, Mamata Banerjee, MK Stalin, Narendra modi, Rahul Gandhi, TMC, West Bengal