గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి... ఇకపై కూడా కొనసాగుతుందా ? మహాకూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన పార్టీలన్నీ కలిసి పంచాయతీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను ఢీ కొడతాయా ? కాంగ్రెస్ నేతలతో పాటు మహాకూటమి పార్టీల శ్రేణులను కొంతకాలంగా ఇలాంటి సందేహాలు వెంటాడుతున్నాయి. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇంకా సమీక్ష నిర్వహించని ఆ పార్టీ అధినాయకత్వం... త్వరలోనే ఇందుకు సమయం కేటాయించబోతోంది.
ఇదే సమయంలో తెలంగాణలో మహాకూటమి కొనసాగింపు అంశంపై కూడా రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ గాంధీ తగిన సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందనే భావన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుండగా... చంద్రబాబు కారణంగా కాంగ్రెస్‌కు నష్టం జరిగిందన్న వాదనలో ఎలాంటి నిజం లేదని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే... తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు తీసుకునే అవకాశం లేకపోలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్‌కు టీడీపీ, టీడీపీకి కాంగ్రెస్ మద్దతు అవసరం కావడంతో... తెలంగాణలోనూ వీరి మధ్య స్నేహం అనివార్యంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదే అని తెలుస్తోంది. మహాకూటమిని అలాగే కొనసాగించాలా లేక అందులోని కొన్ని పార్టీలను పక్కనపెట్టాలా అనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగే చర్చల తరువాత తెలుస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మహాకూటమి కొనసాగింపు అంశంపై వారం రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో... దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Congress, Mahakutami, Rahul Gandhi, Tdp, Telangana