హోమ్ /వార్తలు /national /

హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తాం: రాజాసింగ్

హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తాం: రాజాసింగ్

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు మార్పు ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా మొదలైంది. వివిధ రాష్ట్రాల్లో కొన్ని నగరాల పేర్లు మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మొదటగా హైదరాబాద్ పేరును మార్చేస్తామని ఆ పార్టీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ప్రకటించారు. మొదట ఈ సిటీ పేరు భాగ్యనగరమేనని, తర్వాత కాలంలో హైదరాబాద్‌గా మార్చేశారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు సికింద్రాబాద్ పేరు కూడా మార్చేస్తామని రాజాసింగ్ అన్నారు. దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వారి పేర్లు సికింద్రాబాద్‌కు పెడతామన్నారు. దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన మొఘలుల పేరు మీద దేశంలో చాలా చోట్ల పేర్లు ఉన్నాయని, వాటన్నిటినీ తొలగించాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్‌గా మార్చింది. తాజాగా ఫైజాబాద్ జిల్లా పేరును శ్రీఅయోధ్యగా మార్చింది. ఈ స్ఫూర్తితో గుజరాత్‌లో అత్యంత ప్రధాన పట్టణాల్లో ఒకటైన అహ్మదాబాద్ పేరును మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చేందుకు ఆలోచిస్తున్నామని, దానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తున్నామన్నారు. అదే సమయంలో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం మీద కూడా శివసేన బాణాలు ఎక్కుపెట్టింది. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు ఎప్పుడు మారుస్తారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్ నగర్‌గా మార్చాలని కొన్నేళ్లుగా శివసేన డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

First published:

Tags: Hyderabad, Raja Singh, Telangana Election 2018