హోమ్ /వార్తలు /national /

చంద్రబాబు మంగళగరిలో ప్రచారం చేస్తారా ? లోకేశ్‌ను గట్టెకిస్తారా ?

చంద్రబాబు మంగళగరిలో ప్రచారం చేస్తారా ? లోకేశ్‌ను గట్టెకిస్తారా ?

లోకేశ్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

లోకేశ్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో... చంద్రబాబు మంగళగిరిలో లోకేశ్ తరపున ప్రచారం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఎన్నికలపై ఎవరి అంచనాలు ఏ విధంగా ఉన్నా... తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధిస్తాడా లేదా అన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. లోకేశ్‌కు ప్రత్యర్థిగా వైసీపీ ముఖ్యనేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండటం... ఆయన కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే తరపున జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ప్రచారం నిర్వహించారు.

  తన ప్రచారంలో లోకేశ్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. మోహన్ బాబు సహా పలువురు ప్రముఖులు కూడా మంగళగిరిలో ఆర్కే తరపున ప్రచారానికి వచ్చారు. అయితే టీడీపీ తరపున లోకేశ్ ఒక్కటే మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు. మధ్యలో ఉత్తరాంధ్ర సహా ఇతర ప్రాంతాల్లో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించిన లోకేశ్... కొద్దిరోజుల నుంచి మళ్లీ మంగళగిరికే పరిమితం అయ్యారు. ఇదిలా ఉంటే... తన తనయుడి తరపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు మంగళగిరికి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో... ఆయన మంగళగిరిలోనూ ప్రచారం చేస్తారా లేదా అన్నది దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

  అయితే కుటుంబసభ్యులతో కలిసి మంగళగిరి పానకాల నరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు... అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. పరిస్థితిని బట్టి ఆయన మంగళగిరిలో ప్రచారానికి వస్తారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే తనయుడి నియోజకవర్గంలో ప్రచారం చేయకుంటేనే మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి...లోకేశ్ గెలుపు కోసం తెరవెనుక వ్యూహలకు మాత్రమే చంద్రబాబు పరిమితమవుతారా లేక మంగళగిరిలో ప్రచారం చేపట్టి తనయుడిని గెలిపించాలని కోరతారా అన్నది చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Guntur S01p13, Lok Sabha Election 2019, Mangalagiri, Nara Lokesh

  ఉత్తమ కథలు