హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Elections: 35 ఏళ్లుగా అసెంబ్లీకి పోటీ చేయని నేత, కానీ ఐదు సార్లు సీఎం

Bihar Elections: 35 ఏళ్లుగా అసెంబ్లీకి పోటీ చేయని నేత, కానీ ఐదు సార్లు సీఎం

నితీష్ కుమార్, బీహార్ సీఎం (ఫైల్ ఫోటో)

నితీష్ కుమార్, బీహార్ సీఎం (ఫైల్ ఫోటో)

నితీష్ కుమార్ 1977 ఎన్నికల్లో తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు.

  బీహార్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో దశ ఎన్నికలకు సంబంధించి పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది న్యూస్‌18. అది ఎవరి గురించో కాదు. బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి. ఆయన గత 35 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోటీ చేయలేదు. కానీ, ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2000 (8 రోజులు), 2005, 2010, 2015, 2017లో మొత్తం ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నితీష్ కుమార్ శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ 1977 ఎన్నికల్లో తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయకపోయినా ఆయన లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి ఆరు సార్లు (1989, 1991, 1996, 1998, 1999, 2004) గెలుపొందారు.

  2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు నితీష్ కుమార్ బీహార్ ఉభయసభల్లోని ఏ సభలో కూడా సభ్యుడు కాదు. అయితే, ఆయన తన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో 8 రోజుల్లోనే (మార్చి 3, 2000 నుంచి మార్చి, 10, 2000) దిగిపోయారు. 2005లో బీజేపీ - జేడీయూ కూటమి విజయం సాధించినప్పుడు నితీష్ కుమార్ రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. అప్పుడు కూడా ఆయన బీహార్ ఉభయ సభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) నిబంధన ప్రకారం ఉభయ సభల్లో సభ్యుడు కాని వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మంత్రి అయితే, ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. అంటే అసెంబ్లీకి పోటీ చేసి గెలవాలి. లేదా శాసనమండలికి పోటీ చేయడమో, నామినేట్ కావడమో జరగాలి. దీంతో నితీష్ కుమార్ 2006లో శాసనమండలికి ఎన్నికయ్యారు.

  2012లో నితీష్ కుమార్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత మరోసారి బీజేపీ - జేడీయూ కూటమి ఘనవిజయం సాధించడంతో ఆయన మూడోసారి సీఎం అయ్యారు. 2012లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 35 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి ఒక్కసారి కూడా పోటీ చేయకుండా ఐదుసార్లు సీఎం అయిన నితీష్ కుమార్‌ మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఆయనకు లేదని విమర్శిస్తుంటాయి. దీనిపై ఆయన 2012లోనే ఓ సారి వివరణ కూడా ఇచ్చారు. తాను ఇష్ట ప్రకారం ఎమ్మెల్సీ అయ్యాయని, కచ్చితంగా ఎమ్మెల్సీనే అవ్వాలనేది తన అభిమతం కాదన్నారు. నితీష్ రెండోసారి ఎమ్మెల్సీ పదవీకాలం 2018లో ముగిసింది. మూడోసారి కూడా ఎమ్మెల్సీ అయ్యారు. 2024 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు.

  బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి నితీష్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేసే అంశం తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష నేత, గతంలో నితీష్ కుమార్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన మాజీ బాస్‌కు సవాల్ విసిరారు. నితీష్ కుమార్‌కు సత్తా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఆయన ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తానని సవాల్ చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, JDU, Nitish Kumar

  ఉత్తమ కథలు