ఎన్నో ఏళ్లుగా అనేక ప్రభుత్వాలను సవాల్‌గా మారుతున్న అంశం జమ్ముకాశ్మీర్‌లో ఉన్న ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న నిబంధన ఆర్టికల్ 370. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదాను కల్పిస్తోంది. కశ్మీర్ ను భారత్ లో విలీనం చేసేందుకు అప్పటి పాలకుడు రాజా హరిసింగ్ కొన్ని షరతులు పెట్టారు. అందుకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను చేర్చారు. దీనిప్రకారం జమ్మూకశ్మీర్ కు సంబంధించి రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ రంగాలపై భారత్ కు సర్వాధికారాలు సంక్రమిస్తాయి. మిగతా అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. జమ్మూకశ్మీర్ కు ప్రస్తుతం సొంత రాజ్యాంగం కూడా ఉంది.
రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని కశ్మీర్ లో అమలు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా కావాలి. ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు.
జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనల్ని నిర్వచించే ఆర్టికల్ 35ఏ నిబంధన ఆర్టికల్ 370లో భాగమే. దీని ప్రకారం జమ్మూకశ్మీర్ లో ఇతర రాష్ట్రాల ప్రజలు భూములు, ఆస్తులు కొనలేరు. కేవలం అక్కడున్నవారికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 360 ద్వారా దేశమంతా ఆర్థిక అత్యవసర స్థితిని విధించవచ్చు. కానీ కశ్మీర్ లో మాత్రం అమలు చేయలేం. కేవలం విదేశీ దురాక్రమణ, యుద్ధం జరిగే పరిస్థితుల్లో మాత్రమే ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేయొచ్చు. కానీ తాజాగా కేంద్రం చేస్తున్న ఆర్టికల్ రద్దుతో బిల్లుతో ఈ నిబంధనలన్నీ కాశ్మీర్‌లో వీగిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Article 370, Jammu and Kashmir, Kashmir, Kashmir security, Narendra modi, Pm modi