తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి.., టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం.. దేవుడి గుళ్లో ప్రమాణాలు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో అనపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలు మోహరించడంతో అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సక్షన్ విధించారు. తొలుత అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆ తర్వాత రాజకీయాన్ని గుడికి షిఫ్ట్ చేశారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అవినీతి చిట్టాలు బయటపడామని మాటల తూటాలు పేల్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు సేకరించిన 200 ఎకరాల భూముల్లో అక్రమమైనింగ్ చేసి రూ.400 కోట్లు జేబులో వేసుకునేందుకు యత్నిస్తున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణ రెడ్డి.. టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి అంతా ఇంతా కాదని ఆరోపించారు. రామకృష్ణారెడ్డి అవినీతీ చరిత్ర అనపర్తి ప్రజలందరికీ తెలుసని.. అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పారని కౌంటర్ వేశారు. ఆయనంత కలెక్షన్ కింగ్ ఎక్కడా లేరని.. భార్యతో కూడా వసూళ్లు చేయించిన ఘనత రామకృష్ణారెడ్డిదేనని విమర్సించారు.
దీంతో ఇరువురు నేతలు బిక్కవోలు వినాయక ఆలయంలో సత్యప్రమాణాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం ఇద్దరూ ప్రమాణాలు చేస్తామని ఆలయంలోకి వచ్చారు. ఇరు వర్గాల నుంచి ఐదురుకి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఆలయంలో ఎదురెదురు నిలబడిన నేతలు.. తమకు నచ్చినట్లు దేవుడి ముందు ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15నిముషాల పాటు ఆలయంలో ఉన్న నేతలు బయటకు వచ్చి ప్రమాణాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. దేవుడి ముందు నిజాలు మాట్లాడేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి భయపడ్డారని.. వైసీపీ నేతలు ఆరోపించారు. తాము నిజాన్ని నిర్భయంగా చెప్పామన్నారు. దీనికి టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఎవర్నీ లోనికి అనుమతించకుండా ఉంటే నిజాలు బయటికెలా వస్తాయని ప్రశ్నించారు.
అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో తూర్పు గోదావరి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొలుత ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధమవడంతో పోలీసులు అనుమతించలేదు. దీంతో దేవుడి ఎదుట సత్యప్రమాణాలు చేశారు. సత్యప్రమాణాల తర్వాత కూడా ఎవరి ఆరోపణలకు వారు కట్టుబడి ఉన్నామని చెప్పడం గమనార్హం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.