హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vizag steel plant: జయహో విశాఖ ఉక్కు: ఓ వైపు హోరున ఉక్కు ఉద్యమం మరోవైపు రికార్డు స్థాయి ఉత్పత్తి

Vizag steel plant: జయహో విశాఖ ఉక్కు: ఓ వైపు హోరున ఉక్కు ఉద్యమం మరోవైపు రికార్డు స్థాయి ఉత్పత్తి

విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్

ముల్లును ముల్లుతొనే తీయాలన్న సామెతను విశాఖ ఉక్కు కార్మికులు ఫాలో అవుతున్నారు. నష్టాల నెపం చూపి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని చూస్తున్న కేంద్రానికి.. ఉత్పత్తితోనే సమాధానం చెబుతున్నారు. ఓ వైపు ఉద్యమంలో పాల్గొంటునే.. మరోవైపు రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న విశాఖ ఉక్కు వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు ఉక్కు సంకల్పతో ఉద్యమం మహోగ్రమంగా హోరెత్తుతుంటే.. మరోవైపు ఉత్పత్తిలో ఉక్కు ఫ్యాక్టరీ రికార్డుల మోత మోగిస్తోంది. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక లోకం యావత్ కన్నెర్ర చేస్తోంది. అయినా ఆ ఎఫెక్ట్ ఉత్పత్తిపై పడలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తెలిసినా.. అందులోని సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా ఉత్పత్తికి చెమట చిందిస్తున్నారు. దీంతో ఉత్పత్తిని రికార్డు స్థాయికి తీసుకెళ్లారు. ఇదే ఉత్పత్తి కొనసాగితే రెండు మూడేళ్లలో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అస్త్రాన్ని కార్మికులపై ప్రయోగించినా సిబ్బంది మనోధైర్యం కోల్పోలేదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించకుండా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే విధుల్లో భాగమవుతున్నారు. రెట్టించిన అంకితభావంతో పని చేస్తున్నారు. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ కు నష్టాలు ఎరగా చూపించి కేంద్రం మాత్రం ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తోంది. సొంత గనులు లేకున్నా మార్చి నెలలో ఉక్కు చరిత్రలోనే రికార్డులు బద్దలైంది. మార్చి 6న రికార్డు స్థాయిలో 20 వేల 350 మెట్రిక్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తిని సాధించిన కార్మికులు.. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలుకొడుతూ మార్చి 23న 20 వేల 400 ఉత్పత్తి సాధించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిన 40 ఏళ్లలో అధిక ఉత్పత్తిగా చెబుతున్నారు. ఉక్కు ఉత్పత్తి ఇలాగే సాగితే ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి విశాఖ ఉక్కు 300 కోట్లు లాభార్జన దిశగా పరులు తీయడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చిలో బ్లాస్ట్ ఫర్నేస్ 1,2,3 ల నుంచి 20 వేల 400 టన్నుల రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించారు. అయినా ఇవేవీ కేంద్రం పట్టించుకోవడం లేదు.. గతంలో పార్లమెంట్ లో చెప్పిన సమాధానానికే కట్టుబడి ఉంటోంది. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరణ చేసే దిశగానే అడుగులు వేస్తోంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఉక్కు.. ఇకపై విదేశీపరం కానుంది. దీంతో మరోసారి కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఉక్కు నిరసనలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. ప్రైవేటీకరణను వెనక్కు తీసుకోవాలని ఆంధ్రులంతా ముక్తకంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఆ ఆవేదన కేంద్రం చెవిన పడడం లేదు. అందుకే నిరసనలకే పరిమితం కాకుండా తమ పనితనంతో సత్తా చూపుతున్నారు కార్మికులు. సిబ్బంది, అధికారులు.  ఉత్పత్తిని పెంచి స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించవచ్చని కేంద్రానికి తెలిసేలా చేయాలి అనుకుంటున్నారు.   అందుకే విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించడం లేదు.

విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం మూలధనం అప్పులపై 14 శాతం వడ్డీ చెల్లించడం.. సొంత గనులు లేకపోవడమే అంటున్నాయి కార్మిక సంఘాలు. ఇలాంటి సమయంలో సొంతగనులు కేటాయించి విశాఖ ఉక్కుకు అండగా నిలబడాల్సిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడంపై మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయి. మరోవైపు త్వరలోనే సమ్మెకు కూడా సిద్ధమవుతున్నాయి కార్మిక సంఘాలు..

First published:

Tags: Andhra Pradesh, AP News, Central Government, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు