విశాఖ ఉద్యమం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణాలు అయినా అర్పిస్తామంటున్నారు. ముఖ్యంగా లోక్ సభలో నిర్మాలాసీతారామన్ లిఖిత పూర్వక సమాధానం తరువాత ఉద్యమ రూపం మారింది. ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికే కేంద్రం సిద్ధమైందని వంద శాతం స్పష్టత రావడంతో కార్మిక సంఘాలు ఉద్యామానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసింది ఉక్కు పరిరక్షణ కమిటీ. విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరానికి కేటీఆర్ ను పోరాట కమిటీ నాయకులు ఆహ్వానించారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో–కన్వీనర్ గంధం వెంకటరావులు.. హైదరాబాద్ వెళ్లి.. కేటీఆర్‌ను కలిశారు. స్టీల్‌ప్లాంట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానం, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఉద్యమ విధానం అన్ని ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది.
తనను కలిసిన కార్మిక సంఘాలకు కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు ఆయన. ఉక్కు పరిరక్షణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేసినట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. అయితే బడ్జెట్ సమావేశాల తరువాత.. కేసీఆర్ తో మాట్లాడి తాను నేరుగా విశాఖ వస్తానని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కేటీఆర్ హామీతో.. ఆయన కచ్చితంగా విశాఖ వస్తారని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఆయన వస్తారని అంచనా వేస్తున్నారు. నిజంగా కేటీఆర్ వచ్చి ఉద్యమానికి జై కొడితే.. తమ పోరాటం కొంతమేర సక్సెస్ అయిట్టే అని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. కేటీఆర్ లాంటి వారు నేరుగా ఉద్యమంలో పాల్గొంటే రాజకీయంగా గుర్తింపు వస్తుందని.. జాతీయ స్థాయిలో అందరి ఫోకస్ తమ ఉద్యమంపై పడుతుందని. అలాగే ఏపీలో రాజకీయ నేతలపైనా ఒత్తిడి పెరిగి అందరూ ముందుకు వస్తారని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: బావమరిది బాటలోనే బావ: తెలంగాణ రాజకీయాలను తాకిన విశాఖ ఉద్యమ సెగ?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టారని.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. విజయశాంతి అయితే మరో అడుగు ముందుకేసి.. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్టు ఉంది అంటూ సెటైర్లు వేశారు. అయితే ఈ కౌంటర్లకు కేటీఆర్ వెంటనే సమాధాం చెప్పారు.. ఆ విమర్శలు నిజం కాదాని నిరూపించాలి అంటే కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా విశాఖకు రావాల్సి ఉంటుంది. అలా రావడం టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని గట్టిగా ఢీ కొనాలి అంటే సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్ కు చాలా కీలకం అవుతాయి. సాధరణంగానే బీజేపీ నేతలపై ఏపీ ప్రజల్లో కాస్త ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి. దీనికితోడు ఇప్సుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనతో బీజేపీపై ఏపీ ప్రజలకు కోపం పెరిగింది అన్నది వాస్తవం.. ఇలాంటి సమయంలో కేటీఆర్ నేరుగా వచ్చి ఉద్యమంలో పాల్గొంటే.. సెటిలర్ల ఓట్లు కచ్చితంగా టీఆర్ఎస్ కే పడే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KTR, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant