హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Virbhadra Singh: వీరభద్రసింగ్ ఇక లేరు.. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత

Virbhadra Singh: వీరభద్రసింగ్ ఇక లేరు.. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత

వీరభద్రసింగ్ (File Photo)

వీరభద్రసింగ్ (File Photo)

Veerbhadra Singh: వీరరభద్ర సింగ్ తన రాజకీయ జీవితంలో మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్‌కు 6 సార్లు సీఎంగా పనిచేశారు.

హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో సిమ్లాలోని ఇందిరగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ (IGMC)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం తెల్లవారుజామున 03.40 గంటలకు వీరభద్రసింగ్ కన్నుమూసినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జనక్ రాజ్ తెలిపారు. వీరభద్రసింగ్ పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్యం విషమించింది. గుండెపోటు రావడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. కానీ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు.


వీరభద్రసింగ్‌ రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు కరోనా బారిపడ్డారు. మొదట ఏప్రిల్ 12న ఆయన కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలతో మొహాలీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఏప్రిల్ 23న డిశ్చార్జి అయ్యారు. అనంతరం మొహాలీ నుంచి సిమ్లాకు వెళ్లారు. సిమ్లాకు రాగానే శ్వాస సంబంధ సమస్యలు రావడంతో ఐజీఎంసీకి తరలించారు. ఆ తర్వాత జూన్ 11న కూడా మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం విషమించింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కన్నుమూశారు.

వీరరభద్ర సింగ్ తన రాజకీయ జీవితంలో మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్‌కు 6 సార్లు సీఎంగా పనిచేశారు. 1983 ఏప్రిల్ 8 నుంచి 1990 మార్చి 5 వరకు, ఆ తర్వాత 1993 డిసెంబరు 3 నుంచి 1998 మార్చి 23 వరకు, అనంతరం 2003 డిసెంబరు 29 నుంచి 2007 డిసెంబరు 29, ఆ తర్వాత 2012 డిసెంబరు 25 నుంచి 2017 డిసెంబరు 26 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 మార్చి నుంచి 2003 మార్చి వరకు ప్రతిపక్ష నేతగానూ పనిచేశారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య కూడా రాజకీయనేతలే. ప్రతిభా సింగ్ మాజీ ఎంపీ కాగా.. ఆయన కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరభద్రసింగ్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

First published:

Tags: Congress, Himachal Pradesh

ఉత్తమ కథలు