ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వైరం కొనసాగుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇళ్లస్థలాల విషయంలో ఏర్పడిన వివాదం వంశీని ఇబ్బందికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. బాపులపాడు మండలం, మల్లవల్లిలో ఏర్పాటు చేసిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే వంశీ రావడంతో స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు తమ గ్రామంలోకి రావొద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వంశీ స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. పోలీసులు గ్రామస్తులతో మాట్లాడినా వారు శాంతించలేదు. వంశీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ పట్టాలిస్తామని వంశీ హామీ ఇచ్చినా వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.
వరుస వివాదాలు
ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి ఇలాంటి అభవాలే ఎదురవుతున్నాయి. దీని వెనుక రాజకీయ విభేదాలున్నాయని ఆయన వర్గం అంటోంది. వంశీ వైసీపీకి మద్దతివ్వడాన్ని స్థానిక నేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుకు కూడా వంశీతో విభేదాలున్నాయి. దీంతో వంశీ ఎక్కడికెళ్తే అక్కడ నిరసనలు ఎదురవుతున్నాయి. ఇటీవల గన్నవరం మండలం, గొల్లనపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వంశీ వెళ్లగా.., అక్కడ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు హల్ చల్ చేశారు. దీంతో వంశీ వర్గానికి, యార్లగడ్డ వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. అలాగే కేసరపల్లిలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. వంశీ హాజరైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను వైరి వర్గం అడ్డుకుంది. అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలోనూ వంశీకి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే తమపై వంశీ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కూాాడా కొందరు బహిరంగ విమర్శలు చేశారు.
తొలి నుంచీ రాజకీయ వైరం..
ఇటీవల వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా ఉన్న జోజిబాబు.. వంశీ తమను వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఐతే గన్నవరం వైసీపీ నేతలు వంశీ రాకను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 2019లో గన్నవరం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు కేడీసీసీబీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో కొంత సైలెంట్ అయ్యారు. మొన్నామధ్య తన పుట్టినరోజు వేడుకల్లో వంశీపై విమర్శలు చేసి మళ్లీ వేడిపుట్టించారు. వీళ్లిద్దరి మధ్య సీఎం జగన్ స్వయంగా రాజీ కుదిర్చారు. మరోవైపు నియోజకవర్గానికే చెందిన వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కూడా వంశీని వ్యతిరేకించారు. మధ్యలో వంశీతో సఖ్యతగా ఉన్నా ఆ తర్వాత భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వంశీ కార్యకర్తలను వేధిస్తున్నారని.. గన్నవరంలో ఉపఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీలో విభేదాలను పక్కనబెట్టి వంశీతో కలిసి పనిచేయాలని సీఎం జగన్ సూచించినా ఇక్కడి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, Gannavaram, Vallabaneni Vamsi, Ysrcp