కొద్దివారాలుగా ఏపీలోని అధికార పార్టీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అనూహ్యంగా జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని సమర్ధిస్తూనే జగన్‌కు సలహాలిచ్చారు ఎంపీ కేశినేని నాని. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వానికో, వాన్‌పిక్‌కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వమే ఈ పోర్ట్ పనులను నిర్వహించేలా నిర్ణయం తీసుకుని తన చిత్తశుద్ధిని సీఎం జగన్ నిరూపించుకోవాలని కేశినేని నాని కోరారు.
అయితే కేశినేని నాని ఈ విషయంలో వైసీపీకి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కాంట్రాక్ట్‌ను మరో కంపెనీకి ఇవ్వకుండా... ముందుగానే ప్రభుత్వమే ఈ పనులు చేపట్టాలని ఆయన సూచించారని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంగానే గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్‌కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఆ సంస్థకు లీజుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు పరిహారం కూడా కోరే అవకాశాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Kesineni Nani, Tdp, Ysrcp